ఇంగ్లండ్‌ క్లీన్‌స్వీప్‌, వరుసగా ఆరో విజయం

England beat Sri Lanka in second Test to sweep series - Sakshi

గాలె: స్పిన్నర్ల మాయాజాలంతో శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్‌ ఆరు వికెట్ల తేడాతో నెగ్గి రెండు టెస్టుల సిరీస్‌ను 2–0తో క్లీన్‌ స్వీప్‌ చేసింది. శ్రీలంక నిర్దేశించిన 164 పరుగుల విజయలక్ష్యాన్ని ఇంగ్లండ్‌ 43.3  ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. డామ్‌ సిబ్లీ (56 నాటౌట్‌; 2 ఫోర్లు), జాస్‌ బట్లర్‌ (46; 5 ఫోర్లు) ఐదో వికెట్‌కు అజేయంగా 75 పరుగులు జోడించి మరో రోజు ఆట మిగిలిఉండగానే జట్టును గెలిపించారు. శ్రీలంక గడ్డపై ఇంగ్లండ్‌కిది వరుసగా ఆరో టెస్టు విజయం కావడం విశేషం. విదేశీ గడ్డపై ఆతిథ్య జట్టుపై ఇంగ్లండ్‌ వరుసగా ఆరు టెస్టుల్లో గెలుపొందడం ఇదే ప్రథమం. శ్రీలంకలో 2012లో ఒక టెస్టు నెగ్గిన ఇంగ్లండ్‌... 2018 పర్యటనలో ఆడిన మూడు టెస్టుల్లోనూ గెలిచింది. తాజా పర్యటనలో ఆడిన రెండు టెస్టుల్లోనూ విజయాన్ని సొంతం చేసుకుంది.  

ఆట నాలుగోరోజు సోమవారం ఓవర్‌నైట్‌ స్కోరు 339/9తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఇంగ్లండ్‌ మరో 5 పరుగులు జోడించి 344 పరుగుల వద్ద ఆలౌటైంది. దీంతో శ్రీలంకకు 37 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన శ్రీలంకను ఇంగ్లండ్‌ స్పిన్నర్లు డామ్‌ బెస్‌ (4/49), జాక్‌ లీచ్‌ (4/59), జో రూట్‌ (2/0) దెబ్బతీశారు. ఈ ముగ్గురి ధాటికి లంక 35.5 ఓవర్లలో 126 పరుగులకే ఆలౌటైంది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు ఇంగ్లండ్‌ పేసర్లు తీయగా... రెండో ఇన్నింగ్స్‌లోని 10 వికెట్లను స్పిన్నర్లు తీయడం విశేషం. ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’... ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ పురస్కారాలు లభించాయి.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top