BCCI: త్వరలోనే టీమిండియా ఎంట్రీ పక్కా! | Don't Make Him Wait: BCCI Gets Stunning Vaibhav Sooryavanshi Message | Sakshi
Sakshi News home page

ఇంకెందుకు ఆలస్యం?.. 20 ఏళ్లు ధనాధన్‌.. బౌలర్లకు వణుకే!

Apr 8 2026 1:46 PM | Updated on Apr 8 2026 4:17 PM

Don't Make Him Wait: BCCI Gets Stunning Vaibhav Sooryavanshi Message

రాజస్తాన్‌ రాయల్స్‌ స్టార్‌, భారత అండర్‌-19 వరల్డ్‌కప్‌ విజేత వైభవ్‌ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇటు ఐపీఎల్‌లో.. అటు భారత జూనియర్‌ జట్టు తరఫున ఈ బిహారీ పిల్లాడు ఇరగదీస్తున్న సంగతి తెలిసిందే. విధ్వంసకర బ్యాటింగ్‌కు పెట్టింది పేరుగా మారి.. ఇప్పటికే ఎన్నో ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు వైభవ్‌.

మెరుపులు మెరిపించాడు
ఇక ఐపీఎల్‌-2026లోనూ వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) దుమ్ములేపుతున్నాడు. ఈ సీజన్‌లో రాయల్స్‌ ఇప్పటికి ఆడిన మూడు మ్యాచ్‌లూ గెలవడంలో ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ది కీలక పాత్ర. అతడు చేసిన స్కోర్లు వరుసగా.. 17 బంతుల్లో 52, 18 బంతుల్లో 31, 14 బంతుల్లో 39 పరుగులు.

ఈ నేపథ్యంలో భారత జాతీయ జట్టుకు వైభవ్‌ సూర్యవంశీని ఎంపిక చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో వరల్డ్‌క్లాస్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాకు సిక్సర్‌తో వైభవ్‌ ఆహ్వానం పలికిన తీరు దిగ్గజాలను సైతం ఆకట్టుకుంటోంది.

డెస్టినీ చైల్డ్‌
ఈ క్రమంలో భారత మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ వైభవ్‌ సూర్యవంశీ ఆట తీరుపై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘‘సూర్యవంశీ డెస్టినీ చైల్డ్‌. అతడి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండబోతోంది. పదిహేనేళ్ల వయసులోనే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అతడి ప్రదర్శన చూసి ఆశ్చర్యంగా ఉంది.

చితక్కొడతాను అని చెప్పి మరీ కొట్టాడు
ఇంతకు ముందు ఎవరూ ఇలాంటి ప్రదర్శన ఇవ్వలేదు. ఈ పిల్లాడు ఏం చెప్పాడో గుర్తుందా?.. ‘నేను జస్‌ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌లో ఆడేందుకు ఎదురుచూస్తున్నా. గతేడాది అవుటయ్యాను. ఈసారి మాత్రం కచ్చితంగా అతడి బౌలింగ్‌లో చితక్కొడతాను’ అని చెప్పాడు.

అన్నట్లుగానే మొదటి బంతికే బుమ్రా బౌలింగ్‌లో సిక్సర్‌ బాదాడు. దీంతో బుమ్రా సైతం ఆశ్చర్యానికి లోనయ్యాడు. తన వ్యూహం మార్చుకుని స్లో బాల్‌ వేయాల్సి వచ్చింది. అసలు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో బుమ్రా కంటే అత్యుత్తమ బౌలర్‌ ఎవరూ లేరు. అలాంటిది బుమ్రా బౌలింగ్‌లోనే వైభవ్‌ అదరగొట్టాడు.

20 ఏళ్లు ధనాధన్‌
దయచేసి వైభవ్‌ను ఇంకా ఎదురుచూసేలా చేయకండి. త్వరలోనే అతడికి టీమిండియా క్యాప్ ఇవ్వండి. అతడు ఇరవై ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌ ఆడగలడు. బౌలర్లకు ఇక చుక్కలే. వారిని భయపెడుతున్న పేరు వైభవ్‌’’ అంటూ టీమిండియాకు వైభవ్‌ను ఎంపిక చేయాలని ఇర్ఫాన్‌ పఠాన్‌ బీసీసీఐకి సూచించాడు. 

చదవండి: Yashasvi Jaiswal: ‘టార్గెట్‌ మూడు ఓవర్లే.. అందుకే ఈ విధ్వంసం’

Advertisement
 
Advertisement
Advertisement