హర్ముజ్‌పై టోల్‌ ఫీజు!.. చట్టం ఏం చెబుతోంది? | Middle East Crisis: Iran Ready to Open Hormuz Conditions Apply | Sakshi
Sakshi News home page

హర్ముజ్‌పై టోల్‌ ఫీజు!.. చట్టం ఏం చెబుతోంది?

Apr 8 2026 7:51 AM | Updated on Apr 8 2026 9:14 AM

Middle East Crisis: Iran Ready to Open Hormuz Conditions Apply

పశ్చిమాసియా సంక్షోభానికి తాత్కాలిక తెర పడింది. అటు అమెరికా, ఇటు ఇరాన్‌ రెండు వారాల కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఇస్లామాబాద్‌(పాకిస్తాన్‌)  వేదికగా ఈ నెల 10న శాంతి చర్చలు జరగనున్నాయి. ఇరాన్‌ ప్రతిపాదించిన సూత్రాలు ‘వర్కబుల్‌’ అంటూ ట్రంప్‌ ప్రకటించడం గమనార్హం. అయితే.. కీలకమైన హర్ముజ్‌ జలసంధి విషయంలోనే కఠిన షరతులు కనిపిస్తున్నాయి.

ప్రపంచ చమురు వ్యాపారంలో ఐదవ వంతు హర్ముజ్‌ జలసంధి మార్గం ద్వారా జరుగుతుందన్నది తెలిసిందే. యుద్ధం నేపథ్యంలో ఈ దారి మూసుకుపోయి.. పలు దేశాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. దీంతో ఈ విషయంలో ట్రంప్‌ పలుమార్లు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తూ వచ్చారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ దారిని తెరిచేందుకు ఇరాన్‌ అంగీకరించింది. అయితే ట్రంప్ ప్రకటించిన కాల్పుల విరమణ ఒప్పందం అమలు కావడం అనేది హర్ముజ్‌ తెరుచుకోవడంపైనే ఆధారపడి ఉన్నట్లు కనిపిస్తోంది.

ట్రంప్‌ ప్రకటన తర్వాత.. ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మూసేసిన హర్ముజ్‌ను వెంటనే తెరిచేందుకు ఇరాన్‌ అంగీకరించింది. అయితే ఈ విషయంలో కొన్ని కఠినమైన షరతులు పెట్టింది. కాల్పుల విరమణ అమల్లో ఉండే రెండు వారాలపాటు పరిమిత నౌకా రవాణాకు మాత్రమే అనుమతి ఇస్తామని.. మళ్లీ దాడులు జరిగితే తక్షణమే ఆపేస్తామని అంటోంది. చర్చల కాలం లోపు ప్రతిదాడులను ఆపి నౌకలకు సురక్షిత ప్రయాణం కల్పిస్తామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి ప్రకటించారు. 

ఇరాన్‌ అమెరికా ముందు 10 డిమాండ్లు ఉంచింది. ఇదే అదనుగా పైసా వసూల్‌ ప్లాన్‌ను కూడా ఆచరణలో పెట్టాలనుకుంటోంది. భవిష్యత్తులో హర్ముజ్‌పై పూర్తి నియంత్రణ తమదే ఉండాలని ఇరాన్‌ డిమాండ్‌ చేస్తోంది. హర్ముజ్‌ జలసంధి ద్వారా నౌకలు ప్రయాణించాలంటే.. ఇరాన్‌ సైన్యంతో ముందస్తు సమన్వయం తప్పనిసరి అని అంటోంది. అంతేకాదు.. ఈ మార్గం గుండా టోల్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, ప్రయాణించే నౌకలకు చార్జీలు వసూలు చేస్తామని, వాటిని యుద్ధంతో దెబ్బ తిన్న తమ దేశ పునరుద్ధరణ.. భవిష్యత్తులో అభివృద్ధి కోసం వెచ్చిస్తామని చెబుతోంది. అయితే తమ షరతుల్లో ఏదైనా తేడా వస్తే మళ్లీ యుద్ధం మొదలుపెడతామని ఇరాన్‌ స్పష్టం చేసింది. దీంతో ఇస్లామాబాద్‌ చర్చలు కీలకం కానున్నాయి.

టోల్‌ ప్లాజా ఏర్పాటు.. చెల్లుతుందా?.. 
జలసంధి మూసివేతతో చమురు ధరలు పెరిగాయి. ఇప్పుడు తాత్కాలికంగా తెరవడం వల్ల ధరలు స్థిరపడే అవకాశం ఉంది. అయితే.. హర్ముజ్‌ జలసంధిలో ఇప్పటిదాకా ఎలాంటి టోల్‌ వసూలు చేయలేదు. అలాంటప్పుడు ఇరాన్‌ తాజా కండిషన్‌ చెల్లుబాటు అవుతుందా? అనేది పరిశీలిస్తే.. 

ఇరాన్, ఒమన్‌లు కలిసే హర్ముజ్ ద్వారా వెళ్లే నౌకలపై ట్రాన్సిట్ ఫీజు వసూలు చేయాలనుకుంటున్నాయి. అయితే.. గల్ఫ్ దేశాలైన యూఏఈ, ఖతార్, ఇతర దేశాలు ట్రాన్సిట్ ఫీజు వసూలు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. జలసంధి గూండా స్వేచ్ఛా నావిగేషన్ కొనసాగాలని మొదటి నుంచి అవి కోరుతున్నాయి. అంతర్జాతీయ చట్టం (UNCLOS) ప్రకారం.. జలసంధి ప్రయాణానికి ఏ దేశాలు ఫీజు వసూలు చేయలేవు. అయితే, పైలటింగ్, టగ్, పోర్ట్ సేవల కోసం మాత్రమే పరిమిత ఫీజులు వసూలు చేసుకోవచ్చు. మొత్తం మీద.. హర్ముజ్ జలసంధి తాత్కాలికంగా తెరుచుకున్నప్పటికీ టోల్‌ ప్లాజ్‌.. ట్రాన్సిట్‌ ఫీజు అంశం కొత్త వివాదానికి దారి తీసే అవకాశం కనిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement