ముంబై: ఒక బిడ్డ దూరమైందన్న శోకం ఒకవైపు.. మరో బిడ్డ జైలు పాలవుతుందన్న భయం మరోవైపు.. ఆ రాత్రి ముంబై హైవేపై జరిగిన ప్రమాదం ఆ కుటుంబానికి 13 ఏళ్ల పాటు నరకాన్ని చూపింది. అయితే ఈ కేసులో చిక్కుముడి ఎట్టకేలకు వీడింది. పోలీసుల రికార్డుల్లో నేరస్తురాలిగా ముద్రపడిన సోదరిని ఆమె సోదరుడే కాపాడాడు.
2012, అక్టోబర్ 14న వెస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవేపై జరిగిన ఆ ఘోర ప్రమాదం ఖురానా కుటుంబంలో తీరని ఆవేదనను నింపింది. ఆస్పత్రిలో అక్క గుంజన్ ప్రాణాలు వదలగా, నాడు కారు నడిపిన చెల్లెలు పారుల్ ఖురానా నిర్లక్ష్యమే ఈ మృతికి కారణమని పోలీసులు కేసు నమోదు చేశారు. సొంత అక్క మరణానికి కారణమయ్యానన్న అపరాధభావం ఒకవైపు, పోలీసుల విచారణ మరోవైపు పారుల్‌ను కుంగదీశాయి. న్యాయం కోసం ఆమె చేసిన పోరాటం ఒక ఏడాది కాదు, రెండేళ్లు కాదు.. ఏకంగా 13 ఏళ్ల పాటు సాగింది.
ఈ కేసులో అత్యంత కీలక మలుపు వారి సోదరుడి వాంగ్మూలం. పోలీసులు చెబుతున్నట్లు పారుల్ కారు నడపలేదని, ప్రమాద సమయంలో స్టీరింగ్ గుంజన్ చేతిలోనే ఉందని అతను కోర్టులో వెల్లడించాడు. వెనుక నుంచి వేగంగా వచ్చిన ‘బెస్ట్’ బస్సు ఢీకొట్టడం వల్లే కారు నియంత్రణ కోల్పోయిందని సాక్ష్యం ఇచ్చాడు. ‘చనిపోయిన ఒక సోదరిని కాదని, తప్పు చేసిన మరో సోదరిని కాపాడటానికి ఏ తమ్ముడూ అబద్ధం చెప్పడు’ అని మేజిస్ట్రేట్ ఏ.ఎం. ముజావర్ చేసిన వ్యాఖ్యలు ఈ కేసులో మానవీయ కోణాన్ని ఆవిష్కరించాయి.
పోలీసుల దర్యాప్తులోని వైఫల్యాలను కోర్టు తీవ్రంగా పరిగణించింది. కారు నేరుగా వెళ్లి స్తంభాన్ని ఢీకొట్టిందని పోలీసులు వాదించగా, కారు వెనుక భాగం ధ్వంసమైన ఫోటోలు అసలు నిజాన్ని బయటపెట్టాయి. బస్సు ఢీకొట్టిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నా, ఆ కోణంలో కనీసం విచారణ చేయకపోవడం దర్యాప్తు అధికారి నిర్లక్ష్యమేనని కోర్టు తేల్చి చెప్పింది. చివరకు వాస్తవాలను, ఫోటో సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకున్న బోరివలి కోర్టు, పారుల్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ 13 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది.


