‘సుప్రీం’లో కొనసాగుతున్న ‘శబరిమల’ విచారణ | Sabarimala women entry Supreme Court to continue hearing of pleas | Sakshi
Sakshi News home page

‘సుప్రీం’లో కొనసాగుతున్న ‘శబరిమల’ విచారణ

Apr 8 2026 12:07 PM | Updated on Apr 8 2026 12:14 PM

Sabarimala women entry Supreme Court to continue hearing of pleas

న్యూఢిల్లీ: శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధిలో మహిళల ప్రవేశంపై  సుప్రీంకోర్టులో బుధవారం కూడా విచారణ  కొనసాగుతోంది. దశాబ్దాలుగా నలుగుతున్న ఈ సున్నితమైన వివాదంపై తాజాగా ‘మహిళలను నెలలో మూడు రోజులు అంటరానివారిగా చూడలేము’ అంటూ సర్వోన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ సుదీర్ఘ వివాదంపై తుది విచారణను చేపట్టింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, 26 కల్పించే మత స్వేచ్ఛ పరిధిని న్యాయస్థానం క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. కేవలం శబరిమల కేసుకే పరిమితం కాకుండా, మసీదుల్లోకి ముస్లిం మహిళల ప్రవేశం, మతాంతర వివాహం చేసుకున్న పార్శీ మహిళల హక్కులు, పలు మతపరమైన వివక్షతలకు సంబంధించిన పిటిషన్లన్నింటినీ కలిపి  ధర్మాసనం విచారిస్తోంది.

మంగళవారం జరిగిన విచారణలో కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలను ఆలయంలోకి అనుమతించకపోవడాన్ని ‘వివక్ష’గా పరిగణించలేమని, అది వారి మత విశ్వాసాల పరిధిలోని అంశమని ఆయన వాదించారు. ప్రాథమిక హక్కుల కింద రక్షణ పొందాలంటే ఒక ఆచారం కేవలం మూఢనమ్మకం కాకుండా, ఆ మతంలో ‘అత్యవసర ఆచారం’ అని నిరూపించుకోవాలని గత కోర్టు తీర్పులను ఉదహరించారు.

ఈ వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘సామాజిక రుగ్మతలను మతాచారాలుగా ముద్రవేయలేం’ అని తేల్చిచెప్పింది. ధర్మాసనంలోని జస్టిస్ బి.వి నాగరత్న స్పందిస్తూ, రుతుక్రమం ఆధారంగా మహిళలను పవిత్ర స్థలాల్లో అంటరానివారిగా చూడటం సరికాదని అభిప్రాయపడ్డారు. 2018లో ఐదుగురు సభ్యుల ధర్మాసనం శబరిమలలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ, చారిత్రాత్మక తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ శతాబ్దాల నాటి ఆచారం రాజ్యాంగ విరుద్ధమని అప్పట్లో కోర్టు పేర్కొంది. ఆ తర్వాత 2019లో అప్పటి సీజేఐ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం, ఈ మతపరమైన అంశాలన్నింటినీ విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. 

ఇది కూడా చదవండి: టెక్ ప్రపంచం షేక్.. ‘ఓపెన్ ఏఐ’ సంచలన ప్రతిపాదన!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement