టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ ఐపీఎల్ 19వ సీజన్‌లో తన ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. ఈ సీజన్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న షమీ ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు వికెట్లు తీయడమే గాక అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును సొంతం చేసుకున్నాడు.
అయితే దేశవాలీ, ఐపీఎల్‌లో మంచి ప్రదర్శన చేసినప్పటికీ బీసీసీఐ సెలెక్టర్లు మాత్రం షమీని పట్టించుకోవడం లేదు. దీంతో షమీని జాతీయ జట్టులోకి తిరిగి తీసుకోవాలనే వాదనలు పెరిగిపోయాయి. ఇక ఐపీఎల్ 19వ సీజన్‌లో భాగంగా గురువారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్‌తో లక్నో తలపడనుంది.
షమీ స్వస్థలం ఉత్తర్‌ప్రదేశ్ అయినప్పటికీ దేశవాలీ క్రికెట్‌లో మాత్రం అతడు బెంగాల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ లెక్కన ఈడెన్ గార్డెన్స్ షమీకి సొంత మైదానం వంటిది. ఇటీవలే రంజీ ట్రోఫీలోనూ బెంగాల్ తరఫున పాల్గన్న షమీ తాజాగా లక్నో తరఫున ఈడెన్‌లో బరిలోకి దిగనున్నాడు. ఈ నేపథ్యంలో షమీ మంగళవారం బెంగాల్ ప్రొ టీ20 లీగ్ మూడో సీజన్ ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యాడు.
ఇదే కార్యక్రమానికి కేకేఆర్ కెప్టెన్ రహానే, వైస్‌కెప్టెన్ రింకూ సింగ్ కూడా వచ్చారు. షమీ మాట్లాడుతూ.. ‘సొంతమైదానంలో మ్యాచ్ ఆడడం ఎవరికైనా అనుకూలంగానే ఉంటుంది. ఒక లోకల్ ఆటగాడిగా కేకేఆర్‌కు ప్రత్యర్థిగా ఆడినప్పటికీ పిచ్‌పై పూర్తి అవగాహన ఉండడం సానుకూలాంశం.’ అని చెప్పుకొచ్చాడు.
స్థిరమైన ప్రదర్శన చేస్తున్నప్పటికీ జాతీయ జట్టులో చోటు దక్కకపోవడంపై కూడా షమీ తనదైన శైలిలో స్పందించాడు. ‘మనం రోజువారీ కూలీలం మాత్రమే. అవకాశం మన తలుపు తట్టేవరకు నిత్యం బౌలింగ్ వేస్తూనే ఉండాలి.’ అని సెలెక్షన్ కమిటీని ఉద్దేశిస్తూ చమత్కరించాడు.
షమీ ఇంకా మాట్లాడుతూ.. ‘జీవితంలో ఎత్తుపల్లాలు, గాయాలు కావడం సహజం. కానీ మన గ్రౌండ్ లెవెల్ హార్డ్‌వర్క్ మూలాలు మాత్రం ఎప్పటికీ మరిచిపోకూడదు. నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చానని, ఒక ఆటగాడిగా అవకాశం కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తూనే ఉంటాను.
నా దృష్టిలో దేశవాలీ క్రికెట్‌కు అధిక ప్రాధాన్యమిస్తాను. నేను ఉత్తర్‌ప్రదేశ్‌లో పుట్టినప్పటికీ బెంగాల్ ఎప్పటికీ నా కర్మభూమినే. నాలో శక్తి, పోరాడే తత్వం ఉన్నంతవరకు బెంగాల్‌కు ఆడుతూనే ఉంటాను’ అని చెప్పుకొచ్చాడు. దేశవాలీ టోర్నీ అయిన రంజీ ట్రోఫీలో మహ్మద్ షమీ అద్భుత ప్రదర్శన కనబరిచాడు.
బెంగాల్ తరఫున 16.72 ఎకానమీతో 37 వికెట్లు పడగొట్టి స్థిరమైన ప్రదర్శనతో టాప్-6 బౌలర్లలో ఒకడిగా నిలిచాడు. రంజీలో బెంగాల్ సెమీస్ చేరడంలోనూ షమీ కీలకపాత్ర పోషించాడు. 90 పరుగులిచ్చి 8 వికెట్లు తీసి బెంగాల్‌ను ఫైనల్ చేర్చాడు.


