వైభవ్‌ సూర్యవంశీ చరిత్రాత్మక రికార్డు | Vaibhav Sooryavanshi Submerges Legends To Create Historic IPL Record | Sakshi
Sakshi News home page

వైభవ్‌ సూర్యవంశీ చరిత్రాత్మక రికార్డు

Apr 8 2026 1:36 PM | Updated on Apr 8 2026 2:28 PM

Vaibhav Sooryavanshi Submerges Legends To Create Historic IPL Record

రాజస్థాన్‌ రాయల్స్‌ చిచ్చరపిడుగు, యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ ఐపీఎల్‌ 2026లో తన అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తున్నాడు. ఈ ఎడిషన్‌లో 3 మ్యాచ్‌ల్లోనే 11 సిక్సర్లు బాదిన అతను.. ఓ చరిత్రాత్మక రికార్డును సొంతం చేసుకున్నాడు. తాజాగా (ఏప్రిల్‌ 7) ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 సిక్సర్లు బాదిన అనంతరం ఈ ఘనతను సాధించాడు.

ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే..?
సూర్యవంశీ ఇప్పటివరకు తన ఐపీఎల్‌ కెరీర్‌లో 10 ఇన్నింగ్స్‌ల్లో 171 బంతులు ఎదుర్కొని 35 సిక్స్‌లు బాదాడు. అంటే ప్రతి 4.88 బంతులకు ఓ సిక్సర్‌ బాదినట్లు లెక్క. ఇది ఐపీఎల్‌ చరిత్రలో కనీస బంతుల్లో సిక్స్‌ కొట్టిన రికార్డు. ఈ విభాగంలో రొమారియో షెపర్డ్‌, ఉర్విల్‌ పటేల్‌, జేక్‌ ఫ్రేజర్‌ మెక్‌గుర్క్‌, ఆండ్రీ రసెల్‌ లాంటి విధ్వంసకర బ్యాటర్లను సూర్యవంశీ అధిగమించాడు.

- వైభవ్‌ సూర్యవంశీ – 4.88  
- రొమారియో షెపర్డ్‌ – 5.1  
- ఉర్విల్‌ పటేల్‌ – 5.3  
- జేక్‌ ఫ్రేజర్‌ మెక్‌గుర్క్‌ – 6.4  
- ఆండ్రీ రసెల్‌ – 6.8  

ఆకాశమే హద్దు
ప్రస్తుత ఎడిషన్‌లో వైభవ్‌ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. సీఎస్‌కేతో జరిగిన తొలి మ్యాచ్‌లో 15 బంతుల్లో హాఫ్‌ సెంచరీ (4 ఫోర్లు, 5 సిక్సర్లు) చేసిన అతను.. ఆతర్వాత గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 18 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 31 పరుగులు చేశాడు. తాజాగా ముంబై ఇండియన్స్‌పై కూడా అదే జోరును కొనసాగించి 14 బంతుల్లో ఫోర్‌, 5 సిక్సర్ల సాయంతో 39 పరుగులు చేశాడు.

ఈ సీజన్‌లో వైభవ్‌.. యశస్వి జైస్వాల్‌తో కలిసి అందిస్తున్న మెరుపు ఆరంభాలు రాజస్తాన్‌ రాయల్స్‌ను అత్యంత విజయవంతమైన జట్టుగా కొనసాగిస్తున్నాయి. రాయల్స్‌ ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి, టేబుల్‌ టాపర్‌గా కొనసాగుతుంది.

తాజాగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్స్‌ 27 పరుగుల తేడాతో గెలుపొందింది. వర్షం కారణంగా 11 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన రాయల్స్‌ 3 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. జైస్వాల్‌ (77 నాటౌట్‌) పరుగులతో సత్తా చాటగా.. వైభవ్‌ (39) రాణించాడు. అనంతరం ఛేదనలో ముంబై ఇండియన్స్‌ సైతం పోరాడినప్పటికీ.. లక్ష్యానికి 28 పరుగుల దూరంలో (123-9) నిలిచిపోయింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement