కేంద్ర మాజీ మంత్రి మోహ్సినా కిద్వాయ్ కన్నుమూత | Congress leader Mohsina Kidwai passes away | Sakshi
Sakshi News home page

కేంద్ర మాజీ మంత్రి మోహ్సినా కిద్వాయ్ కన్నుమూత

Apr 8 2026 10:35 AM | Updated on Apr 8 2026 10:46 AM

Congress leader Mohsina Kidwai passes away

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో తీరని విషాదం నెలకొంది. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ తదితర ఉద్దండులతో  కలిపి పనిచేసిన కాంగ్రెస్ కురువృద్ధురాలు, కేంద్ర మాజీ మంత్రి మోహ్సినా కిద్వాయ్ (94) బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. వయోభారంతో తలెత్తిన అనారోగ్య సమస్యలతో నోయిడాలోని మెట్రో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

మోహ్సినా కిద్వాయ్ మరణవార్తను ఆమె బంధువు రజి ఉర్ రెహ్మాన్ కిద్వాయ్ మీడియాకు వెల్లడించారు. ఆమె భౌతికకాయాన్ని మధ్యాహ్నం 3 గంటలకు నోయిడా సెక్టార్-40లోని స్వగృహం నుంచి అంతిమ యాత్రగా తీసుకెళ్లి, సాయంత్రం 5 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆమెకు ముగ్గురు కుమార్తెలు. భర్త ఖలీల్ ఆర్ కిద్వాయ్ గతంలో మృతి చెందారు.

సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం
ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో 1930, జనవరి 1న జన్మించిన మోహ్సినా.. దశాబ్దాల పాటు భారతీయ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. 1977లో మీరట్ నుంచి లోక్‌సభకు ఎన్నికై పార్లమెంటరీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఏడు, ఎనిమిదో లోక్‌సభలకు ఎన్నికైన ఆమె, 2004 నుంచి 2016 వరకు ఛత్తీస్‌గఢ్ నుంచి రాజ్యసభ ఎంపీగా కూడా సేవలందించారు. అంతకుముందు యూపీ రాష్ట్ర ప్రభుత్వంలోనూ పౌరసరఫరాలు, సాంఘిక సంక్షేమం, చిన్న తరహా పరిశ్రమల శాఖల మంత్రిగా పనిచేశారు.

పార్టీకి పెద్ద దిక్కుగా..
1982లో తొలిసారిగా కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మోహ్సినా.. ఆ తర్వాత వైద్య ఆరోగ్య (1983–84), గ్రామీణాభివృద్ధి (1984), రవాణా (1986), పట్టణాభివృద్ధి (1986–89) తదితర కీలక శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు. పలు పార్లమెంటరీ కమిటీల్లో చురుకైన సభ్యురాలిగా వ్యవహరించారు. సోనియా గాంధీకి సైతం అత్యంత సన్నిహితురాలిగా మెలిగిన ఆమె.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యురాలిగా, కేరళ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement