చెన్నై సూపర్ కింగ్స్ జట్టు (PC: BCCI)
మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌ను కష్టాలు వెంటాడుతున్నాయి. గతేడాది కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఐదు మ్యాచ్‌లు ఆడి గాయం వల్ల దూరం కాగా.. దిగ్గజ సారథి మహేంద్ర సింగ్ ధోని మరోసారి పగ్గాలు చేపట్టాడు. అయితే, జట్టు సమిష్టి వైఫల్యం కారణంగా ధోని కెప్టెన్సీపై కూడా మచ్చ పడింది.
గతేడాది సీఎస్‌కే ఆడిన పద్నాలుగు మ్యాచ్‌లలో కేవలం నాలుగు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది. సీఎస్‌కే చరిత్రలో ఇంతటి ఘోర ప్రదర్శన నమోదు చేయడం ఇదే తొలిసారి.
ధోనితో పాటు అతడూ దూరం
ఇక ఐపీఎల్-2026లోనూ చెన్నైకి ఏదీ కలిసిరావడం లేదు. ఇప్పటికి ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ రుతురాజ్ సేన పరాజయం పాలైంది. ఫినిషర్ ధోని (MS Dhoni)తో పాటు పవర్ హిట్టర్ డెవాల్డ్ బ్రెవిస్ (Dewald Brevis) గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు. వీరిద్దరు లేని లోటు జట్టులో స్పష్టంగా కనిపిస్తోంది.

PC: BCCI
కాగా చెన్నై తమ తదుపరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. సీఎస్‌కే సొంతమైదానం చెపాక్ స్టేడియంలో శనివారం జరిగే మ్యాచ్‌కు ధోని అందుబాటులోకి వస్తాడని మేనేజ్‌మెంట్ తొలుత సంకేతాలు ఇచ్చింది. అతడు ఫిట్‌నెస్ టెస్టుకు హాజరుకాబోతునట్లు తెలిపింది.
ఢిల్లీతో మ్యాచ్‌కు కూడా రాలేడు!
అయితే, తాజా సమాచారం ప్రకారం ఢిల్లీతో మ్యాచ్‌కు కూడా ధోని దూరం కానున్నట్లు తెలుస్తోంది. క్రిక్‌బజ్ కథనం ప్రకారం.. ధోని పూర్తిగా కోలుకుని మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించడానికి ఇంకో వారం రోజులు పట్టనున్నట్లు సమాచారం. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఏప్రిల్ 14న జరిగే మ్యాచ్ నాటికి ధోని అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.
ధోని, బ్రెవిస్‌ల గురించి సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథ్ ఇటీవల మాట్లాడుతూ.. ‘‘ధోని రిహాబిలిటేషన్ సెంటర్లో ఉన్నాడు. అతడు ఎప్పటికి కోలుకుంటాడో స్పష్టంగా చెప్పలేము. ఇక బ్రెవిస్ తదుపరి మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చే అవకాశం లేకపోలేదు. అయితే, అతడు పూర్తిగా కోలుకుంటేనే మైదానంలో దిగుతాడు’’ అని తెలిపాడు.
చదవండి: అతడి గురించే మా చర్చ.. అస్సలు భయమేలేదు: హార్దిక్ పాండ్యా


