వైట్ హౌస్ వద్ద ఉద్రిక్తత.. ట్రంప్ గద్దె దిగాలంటూ నిరసనలు | Protesters Gather Outside White House Seeking Trumps Removal | Sakshi
Sakshi News home page

వైట్ హౌస్ వద్ద ఉద్రిక్తత.. ట్రంప్ గద్దె దిగాలంటూ నిరసనలు

Apr 8 2026 9:04 AM | Updated on Apr 8 2026 9:19 AM

Protesters Gather Outside White House Seeking Trumps Removal

వాషింగ్టన్‌: ఇరాన్‌తో రెండు వారాల పాటు దాడులు నిలిపివేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఊహించని విధంగా ఆయనకే ఎదురుతిరిగింది. ఉద్రిక్తతలు తగ్గిస్తాయనుకున్న ఈ ప్రకటన.. ఆయన పదవికే ఎసరు తెచ్చేలా కనిపిస్తోంది. పౌరుల ప్రాణాలు బలిగొన్న ‘యుద్ధ నేరస్థుడు’ వైట్ హౌస్‌లో ఉండటానికి ఎంతమాత్రం వీల్లేదంటూ వాషింగ్టన్ నగర వీధులు ఆందోళనకారుల నినాదాలతో దద్దరిల్లుతున్నాయి.

అమెరికా రాజధానిలో ట్రంప్ పై ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. రాబోయే ఎన్నికల వరకు కూడా వేచి చూసే ప్రసక్తే లేదని, వెంటనే ట్రంప్ గద్దె దిగాలంటూ వేలాది మంది నిరసనకారులు వైట్ హౌస్ ముందు భైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మోర్గాన్ టైలర్ అనే ఆందోళనకారుడు మాట్లాడుతూ.. ‘అమెరికాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ అధ్యక్షుడు చేసిన యుద్ధ నేరాలను ఇక ఎంతమాత్రం సహించలేం. ఈ మొత్తం పాలకవర్గం తప్పుకోవాలి. ఆయన వెళ్లేంతవరకు ప్రతిరోజూ ఇలాగే రోడ్లను దిగ్బంధిస్తాం. ఆయన వల్లే ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు’ అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎలాంటి పక్కా కారణం లేకుండా ఇరాన్‌పై దాడులు చేసి, పౌరుల ప్రాణాలు తీయడాన్ని  నిరసనకారురాలు తీవ్రంగా ఖండించారు. విదేశీ సైనిక చర్యల పేరిట విచ్చలవిడిగా బాంబుల వర్షం కురిపించడం ఘోరమైన తప్పిదమని  మండిపడ్డారు. పౌర హక్కుల సంస్థ ‘నేషనల్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ కలర్డ్ పీపుల్’ (NAACP) ట్రంప్ కు ఊహించని షాకిచ్చింది. ఏకంగా అమెరికా రాజ్యాంగంలోని 25వ సవరణను ఉపయోగించి ట్రంప్‌ను అధ్యక్ష పదవి నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేసింది. 1909లో ఈ సంస్థ స్థాపించబడినప్పటి నుంచి ఒక అమెరికా అధ్యక్షుడిని ఈ విధంగా తొలగించాలని డిమాండ్ చేయడం చరిత్రలో ఇదే తొలిసారి.

‘ఈ అధ్యక్షుడు పదవికి అనర్హుడు, అనారోగ్యంతో ఉన్నారు. అంతేకాదు మతిస్థిమితం లేకుండా ప్రవర్తిస్తున్నారు’ అని ఎన్ఏఏసీపీ అధ్యక్షుడు డెరిక్ జాన్సన్ ఓ ప్రకటనలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు ఇరాన్ అంగీకరించడంతో.. ఇరాన్ పై సైనిక దాడులను రెండు వారాల పాటు నిలిపివేస్తున్నట్లు ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' ఖాతాలో ప్రకటించారు. దీనిని ‘రెండు వైపులా కాల్పుల విరమణ’ గా ఆయన పేర్కొన్నారు. కాగా, ఉద్రిక్తతలు చల్లార్చే క్రమంలో ఏప్రిల్ 10న ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు ప్రారంభం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

ఇది కూడా చదవండి: హార్ముజ్ సెగ: ఆగిన పొయ్యిలు.. నిలిచిన స్నానాలు! 

Advertisement
 
Advertisement
Advertisement