పాక్‌ డ్రెసింగ్‌రూమ్‌కి వెళ్లు: నాసిర్‌ హుసేన్‌కు డీకే కౌంటర్‌ | Dinesh Karthik Asks Nasser Hussain To Enter Pakistan Dressing Room | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌ డ్రెసింగ్‌రూమ్‌కి వెళ్లు: నాసిర్‌ హుసేన్‌కు డీకే కౌంటర్‌

Aug 20 2026 4:48 PM | Updated on Aug 20 2026 5:02 PM

Dinesh Karthik Asks Nasser Hussain To Enter Pakistan Dressing Room

PC: X

ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ నాసిర్‌ హుసేన్‌కు భారత మాజీ క్రికెటర్‌ దినేశ్‌ కార్తిక్‌ గట్టి కౌంటర్‌ ఇచ్చాడు. పాకిస్తాన్‌ ఆటగాడి అవుట్‌ విషయంలో అంతగా బాధనిపిస్తే.. వారి డ్రెసింగ్‌రూమ్‌లోకి వెళ్లి సూచనలు ఇవ్వొచ్చుగా అని చురకలు అంటించాడు. అసలేం జరిగిందంటే.. మూడు టెస్టు మ్యాచ్‌లు ఆడేందుకు పాక్‌ జట్టు  ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే.

171 పరుగులకు ఆలౌట్‌
ఈ క్రమంలో బుధవారం లీడ్స్‌ వేదికగా ఇంగ్లండ్‌- పాక్‌ మధ్య తొలి టెస్టు మొదలైంది. టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. పాక్‌ బ్యాటింగ్‌కు దిగింది. మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 171 పరుగులే చేసి ఆలౌట్‌ అయింది. అనంతరం ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ మొదలుపెట్టగా.. మహ్మద్‌ అబ్బాస్‌ పాక్‌ బౌలింగ్‌ ఎటాక్‌ ఆరంభించాడు.

అయితే, మూడో బంతికే ఇంగ్లండ్‌ ఓపెనర్‌ బెన్‌ డకెట్‌ ఎల్బీడబ్ల్యూ అయినట్లు భావించిన అబ్బాస్‌... కెప్టెన్‌ను ఒప్పించి రివ్యూకు వెళ్లాడు. కానీ.. అల్ట్రాఎడ్జ్‌లో బ్యాట్‌ ఇన్వాల్మెంట్‌ లేదని వచ్చింది. దీంతో అంపైర్‌ కాల్‌ ప్రకారం డకెట్‌ నాటౌట్‌గా తేలాడు. అయితే, తొమ్మిదో ఓవర్లో అబ్బాస్‌ బౌలింగ్‌లోనే డకెట్‌ (15) లెగ్‌ బిఫోర్‌ వికెట్‌గా వెనుదిరగడం విశేషం.

పాక్‌ ఆటగాడి మాదరే కామెంటేటర్‌ కూడా
కాగా తొలి ప్రయత్నంలో డకెట్‌ తప్పించుకోవడంతో అబ్బాస్‌ నిరాశ వ్యక్తం చేశాడు. అదే సమయంలో కామెంట్రీ బాక్స్‌లో ఉన్న నాసిర్‌ హుసేన్‌.. అబ్బాస్‌ మాదిరే అసహనం వ్యక్తం చేశాడు. అంపైర్‌ నిర్ణయం పాకిస్తాన్‌కు అనుకూలంగా ఉండాల్సిందని.. అంపైర్స్‌ కాల్‌ వల్లే అబ్బాస్‌కు నిరాశ ఎదురైందన్నట్లుగా మాట్లాడాడు.

పాకిస్తాన్‌ డ్రెసింగ్‌రూమ్‌కి వెళ్లు
ఇందుకు ప్రతిగా.. పక్కనే ఉన్న దినేశ్‌ కార్తిక్‌.. ‘పాకిస్తాన్‌ డ్రెసింగ్‌రూమ్‌లోకి వెళ్లి.. DRS (డెసిషన్‌ రివ్యూ సిస్టమ్‌) ఎలా పనిచేస్తుందో వాళ్లకు కాస్త నేర్పించండి’ అని చురక వేశాడు. అంపైర్స్‌ కాల్‌ విషయంలో నాసిర్‌ హుసేన్‌ గతంలో చేసిన వ్యాఖ్యలకు పరోక్షంగా ఇప్పుడు కౌంటర్‌ ఇచ్చాడు.

కాగా ఎల్బీడబ్ల్యూ విషయంలో రివ్యూకు వెళ్లినపుడు థర్డ్‌ అంపైర్‌ పరిశీలనలో బంతి స్టంప్స్‌ను తాకినట్లు తేలినా.. ఒకవేళ ఫీల్డ్‌ అంపైర్‌ అంతకుముందు నాటౌట్‌ ఇచ్చి ఉంటే.. బ్యాటర్‌ సేఫ్‌ అవుతాడు. ఒకవేళ బంతికి తాకపోయినట్లు తేలి.. అంతకుముందు అవుట్‌గా ఇచ్చి ఉంటే బ్యాటర్‌ అవుట్‌ అవుతాడు.

గతంలో అలా.. ఇపుడు ఇలా
ఈ నేపథ్యంలో అంపైర్స్‌ కాల్‌ నిబంధనపై ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌, టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి గతంలో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అప్పుడు నాసిర్‌ హుసేన్‌ వీళ్లిద్దరిని విమర్శించి.. అంపైర్స్‌ కాల్‌కు మద్దతు పలికాడు. ఇప్పుడు మాత్రం పాకిస్తాన్‌ ఆటగాడి తరఫున వకాల్తా తీసుకుని అంపైర్స్‌ కాల్‌ను తప్పుబట్టడంతో డీకే కౌంటర్‌ ఇచ్చాడు. కాగా నాసిర్‌ హుసేన్‌ వీలు చిక్కినప్పుడల్లా పాక్‌ జట్టుకు మద్దతుగా నిలుస్తాడన్న సంగతి తెలిసిందే.

చదవండి:  టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై 118 పరుగుల తేడాతో భారత్‌ గెలుపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement