Dimuth Karunaratne: శ్రీలంక కెప్టెన్‌ సంచలన నిర్ణయం

Dimuth Karunaratne To Step Down From Sri Lanka Test Captaincy - Sakshi

శ్రీలంక టెస్ట్‌ జట్టు కెప్టెన్‌ దిముత్‌ కరుణరత్నే సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఐర్లాండ్‌ సిరీస్‌ (ఏప్రిల్‌ 16 నుంచి 28 మధ్యలో 2 టెస్ట్‌లు) తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఇవాళ (మార్చి 20) ప్రకటించాడు. ఇదే విషయాన్ని శ్రీలంక క్రికెట్‌ బోర్డు (ఎస్‌ఎల్‌సీ)కు కూడా తెలియజేసినట్లు వెల్లడించాడు.  కరుణరత్నే నిర్ణయంపై ఎస్‌ఎల్‌సీ స్పందించాల్సి ఉంది. న్యూజిలాండ్‌ చేతిలో 0-2 తేడాతో టెస్ట్‌ సిరీస్‌ కోల్పోయిన నిమిషాల వ్యవధిలోనే కరుణరత్నే రిటైర్మెంట్‌ ప్రకటన చేశాడు.

జట్టులో సాధారణ సభ్యుడిగా కొనసాగుతానని స్పష్టం చేసిన కరుణరత్నే.. కొత్త టెస్ట్ సైకిల్‌కు (వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2023-25) కొత్త కెప్టెన్‌ని నియమించడం మంచిదని సెలెక్టర్లకు తెలిపినట్లు పేర్కొన్నాడు. 2019లో తొలిసారి శ్రీలంక టెస్ట్‌ జట్టు పగ్గాలు చేపట్టిన కరుణరత్నే.. కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే (సౌతాఫ్రికాపై) చారిత్రక సిరీస్‌ సాధించాడు.  

26 టెస్ట్‌ల్లో లంక జట్టు సారధిగా వ్యవహరించిన కరుణరత్నే.. 10 విజయాలు, 7 డ్రాలు, 9 పరాజయాలను ఎదుర్కొన్నాడు. టెస్ట్‌ కెరీర్‌లో 84 మ్యాచ్‌లు ఆడిన కరుణరత్నే.. 39.94 సగటున డబుల్‌సెంచరీ, 14 సెంచరీలు, 34 హాఫ్‌ సెంచరీల సాయంతో 6230 పరుగులు చేశాడు. లంక తరఫున 34 వన్డేలు ఆడిన కరుణరత్నే.. 6 అర్ధశతకాల సాయంతో 767 పరుగులు చేశాడు.

ఇదిలా ఉంటే, వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో శ్రీలంక ఇన్నింగ్స్‌ 58 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఫలితంగా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను కివీస్ 2-0తో‌ క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఈ మ్యాచ్‌తో డబ్ల్యూటీసీ 2021-23 సీజన్‌ ముగియగా..  పాయింట్ల పట్టికలో శ్రీలంక ఐదో స్థానంలో, న్యూజిలాండ్‌ ఆరో స్థానంలో నిలిచాయి. 
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top