CPL 2022: కరేబియన్ ప్రీమియర్ లీగ్.. బార్బడోస్ రాయల్స్  కెప్టెన్‌గా మిల్లర్

David Miller replaces Jason Holder as Barbados Royals captain - Sakshi

కరేబియన్ ప్రీమియర్ లీగ్-2022 సీజన్‌కు ముందు బార్బడోస్ రాయల్స్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు కెప్టెన్‌గా దక్షిణాఫ్రికా స్టార్‌ బ్యాటర్ డేవిడ్ మిల్లర్‌ను నియమించింది. కాగా వెస్టిండీస్‌ ఆల్‌ రౌండర్‌ జాసన్‌ హోల్డర్‌ స్థానంలో బార్బడోస్ నూతన సారథిగా మిల్లర్‌ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ ఏడాది సీజన్‌కు  హోల్డర్‌తో పాటు కైల్‌ మైర్స్‌, ఒషానే థామస్, ఒబెడ్ మెక్‌కాయ్, హేడెన్ వాల్ష్ జూనియర్ వంటి కీలక ఆటగాళ్లను బార్బడోస్ రీటైన్‌ చేసుకుంది. అదే విధంగా దక్షిణాఫ్రికా స్టార్‌  ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌, ఆఫ్టానిస్తాన్‌ స్పిన్నర్‌ ముజీబ్ ఉర్ రెహ్మాన్‌తో బార్బడోస్ ఒప్పందం కుదుర్చుకుంది.

ఇక మిల్లర్‌ చివర సారిగా 2018లో జమైకా తల్లావాస్ తరఫున కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడాడు. అదే విధంగా 2016లో సెయింట్ లూసియా జౌక్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో 15 మ్యాచ్‌లు ఆడిన మిల్లర్‌ 332 పరుగులు సాధించాడు.  కాగా కరేబియన్ ప్రీమియర్ లీగ్-2022 ఆగస్టు 31 నుంచి ప్రారంభం కానుంది. ఇక ఐపీఎల్‌-2022లో గుజరాత్‌ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన మిల్లర్‌ అద్భుతంగా రాణించాడు. గుజరాత్‌ టైటాన్స్‌ టైటిల్‌ కైవసం చేసుకోవడంలో మిల్లర్‌ కీలక పాత్ర పోషించాడు.

ఇక ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌కు ముందు మిల్లర్‌ రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టులో భాగంగా ఉన్నాడు. కాగా బార్బడోస్ రాయల్స్ ఫ్రాంఛైజీలో కూడా రాజస్తాన్‌ వాటా కలిగి ఉంది. ఇక కెప్టెన్‌గా ఎంపికైన మిల్లర్‌ మాట్లాడుతూ.. "ఐపీఎల్‌లో రాజస్తాన్‌ జట్టుతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఇప్పడు అదే జట్టుతో సంబంధం ఉన్న బార్బడోస్ రాయల్స్‌లో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. అదే విధంగా కెప్టెన్‌గా ఎంపిక కావడం నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నాను. కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో బార్బడోస్ జట్టు యువ ఆటగాళ్లతో కూడి ఉన్నంది.  ఈ ఏడాది సీజన్‌లో జట్టుకు నా వంతు కృషి చేయడానికి ఆతృతగా ఎదురు చూస్తున్నాను" అని మిల్లర్‌ పేర్కొన్నాడు.
చదవండిIND Vs WI: కొంపముంచిన అత్యుత్సాహం.. గిల్‌ విషయంలో తప్పుడు ట్వీట్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top