
క్రికెట్‌కు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్‌మీడియాలో సంచలన టాపిక్‌గా మారింది. ఇద్దరు స్టార్ ఆస్ట్రేలియా ఆటగాళ్లు దేశం కోసం భారీ డీల్‌ను కాదనుకున్నారని ప్రచారం జరుగుతుంది.
ఇందులో వాస్తవాస్తవాలు ఎంత వరకో తెలీదు కానీ, సదరు ఆటగాళ్లను మాత్రం వారి స్వదేశ మీడియా ఆకాశానికెత్తేస్తుంది. మా ఆటగాళ్లకు దేశం కంటే డబ్బు ఎప్పుడూ ముఖ్యం కాదంటూ డబ్బా కొట్టుకుంటుంది. ఇది కదా నిజమైన దేశభక్తి అంటే అంటూ గొప్పలకు పోతుంది.
ఆస్ట్రేలియాకు చెందిన ద ఏజ్ (The Age) అనే వార్తా సంస్థ కధనం ప్రకారం.. వారి దేశ స్టార్ ఆటగాళ్లు పాట్ కమిన్స్ (Pat Cummins), ట్రవిస్ హెడ్‌కు (Travis Head) ఓ ప్రముఖ ఐపీఎల్ ఫ్రాంచైజీ ఏడాదికి 10 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 58.2 కోట్లు) చెల్లిస్తామని ఆఫర్ ఇచ్చింది.
షరతేమిటంటే.. వారిద్దరు ఆస్ట్రేలియా తరఫున ఆడటం మానేసి, ఆ ఫ్రాంచైజీకి చెందిన గ్లోబల్ టీ20 లీగ్‌ల్లో మాత్రమే ఆడాలి. ఈ ఆఫర్‌ను కమిన్స్, హెడ్ ఇద్దరూ తిరస్కరించారు. దేశం కంటే తమకు డబ్బు ముఖ్యం కాదని సదరు ఫ్రాంచైజీ యాజమాన్యానికి తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని ఆసీస్ మీడియా గత కొన్ని రోజులుగా హైలైట్ చేస్తుంది. సోషల్‌మీడియాలో సైతం పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటుంది.
వాస్తవాస్తవాలు తెలియని క్రికెట్ అభిమానులు దేశం పట్ల కమిన్స్, హెడ్‌కు ఉన్న అంకితభావాన్ని కొనియాడుతున్నారు. సాధారణంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లకు దేశం తరఫున ఆడితే ఏడాదికి 1.5 మిలియన్ డాలర్లకు మించి రావు. అలాంటిది కమిన్స్, హెడ్ ఇంత భారీ ఆఫర్‌ను ఎలా కాదనుకున్నారని కొందరనుకుంటున్నారు.
ఇతర దేశాల ఆటగాళ్లు ఇలా లేరు..!
కమిన్స్, హెడ్ విషయం పక్కన పెడితే.. ప్రస్తుతం భారత్ మినహా ప్రపంచవాప్తంగా ఉన్న క్రికెటర్లంతా లీగ్ క్రికెట్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారు. జాతీయ జట్ల కెరీర్‌లను పూర్తి వదులుకొని లీగ్‌ల చుట్టూ తిరుగుతున్నారు.
ఇటీవలే వెస్టిండీస్‌కు చెందిన నికోలస్ పూరన్, దక్షిణాఫ్రికాకు చెందిన హెన్రిచ్ క్లాసెన్ తమ అంతర్జాతీయ కెరీర్‌లు అర్దంతరంగా వదిలేసి లీగ్‌ల పంచన చేరారు. వీరే కాక చాలా మంది స్టార్ క్రికెటర్లు లీగ్‌ల్లో లభించే అధిక డబ్బు కోసం దేశానికి ప్రాతినిథ్యం వహించడాన్ని వద్దనుకుంటున్నారు.
వాస్తవానికి ఇందులో ఆటగాళ్ల తప్పేమీ లేదు. ఫ్రాంచైజీలు అధిక డబ్బును ఆశగా చూపిస్తూ వారిని బుట్టలో వేసుకుంటున్నాయి.
తిరిగి కమిన్స్, హెడ్ విషయానికొస్తే.. ప్రస్తుతం వీరు ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీతో ఒప్పందంలో ఉన్నారు. ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం 2025 సీజన్ వేలానికి ముందు కమిన్స్‌ను రూ. 18 కోట్లకు, హెడ్‌ను రూ. 14 కోట్లకు రిటైన్ చేసుకుంది.
గత సీజన్‌లో ఈ ఇద్దరు చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయలేదు. కెప్టెన్‌గా, ఆటగాడిగా కమిన్స్ దారుణంగా విఫలమయ్యాడు. అంతకుముందు సీజన్‌లో చెలరేగిపోయిన హెడ్ గత సీజన్‌లో తస్సుమన్నాడు.
చదవండి: వైభవ్ విఫలమైనా, బౌలర్లు గెలిపించారు.. ఆసీస్ గడ్డపై టీమిండియా గర్జన