ఐపీఎల్ 2026 కీలక దశకు చేరుకున్న వేళ, ఫైవ్ టైమ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. గాయంతో టోర్నీ మొత్తానికి దూరమైన పేసర్ రామకృష్ణ ఘోష్ స్థానంలో కర్ణాటక ఆల్‌రౌండర్ మెక్నీల్ హ్యాడ్లీ నొరొన్హాను జట్టులోకి తీసుకుంది. ఈ విషయాన్ని సీఎస్‌కే సీఈఓ కాశీ విశ్వనాథ్ ధృవీకరించారు. ప్రస్తుతం బీసీసీఐ ఆమోదం కోసం ఫ్రాంచైజీ ఎదురుచూస్తోంది.

24 ఏళ్ల మాక్నీల్ గతేడాది మహారాజా ట్రోఫీలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మంగళూరు డ్రాగన్స్ టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. 13 మ్యాచ్‌ల్లో 148.82 స్ట్రైక్‌రేట్‌తో 253 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా 19 సిక్సర్లు ఉండటం విశేషం.

బ్యాటింగ్‌తో పాటు ఆఫ్ స్పిన్ బౌలింగ్ కూడా వేయగల మాక్నీల్.. ఆ టోర్నీలో 7.44 ఎకానమీతో 10 వికెట్లు తీశాడు. ముఖ్యంగా ఫైనల్లో హుబ్లీ టైగార్స్‌పై 2/25 గణాంకాలతో మెరిశాడు. ఈ ప్రదర్శనలతో అతడికి సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ (కర్ణాటక తరఫున) ఆడే అవకాశం లభించింది. ఆ టోర్నీలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ అతడు ఆకట్టుకున్నాడు.
ఇక రామకృష్ణ ఘోష్ విషయానికి వస్తే, అతడు ఈ సీజన్‌లో సీఎస్‌కే తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. అయితే మే 3న ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కాలికి తీవ్ర గాయం కావడంతో టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అతడికి ఫుట్ ఫ్రాక్చర్ అయినట్లు సీఎస్‌కే ప్రకటించింది.
ఈ సీజన్‌లో సీఎస్‌కే గాయాల సమస్యతో తీవ్రంగా ఇబ్బందులు పడుతోంది. ఇప్పటికే పేసర్ ఖలీల్ అహ్మద్, స్టార్ బ్యాటర్ ఆయుశ్ మాత్రే కూడా సీజన్ మొత్తానికి దూరమయ్యారు. అయుశ్ స్థానంలో ఆకాశ్ మధ్వాల్ జట్టులోకి రాగా.. ఖలీల్ అహ్మద్‌కు ఇంకా ప్రత్యామ్నాయాన్ని ప్రకటించలేదు.
మరోవైపు విదేశీ పేసర్ నాథన్ ఇల్లిస్ కూడా గాయం కారణంగా సీజన్ ఆరంభం నుంచే జట్టుకు దూరంగా ఉంటున్నాడు. అతడి స్థానంలో వచ్చిన స్పెన్సర్ జాన్సన్ కూడా గాయంతో కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండలేదు.
ఇక జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని కూడా కాఫ్ స్ట్రెయిన్‌తో బాధపడుతూ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కీలక ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడం వల్ల సీజన్ ప్రారంభంలో వరుస పరాజయాలు ఎదుర్కొన్న సీఎస్‌కే.. ఆతర్వాత అనూహ్యంగా పుంజుకొని ప్రస్తుతం ప్లే ఆఫ్స్ రేసులో బలంగా నిలబడింది.
ఈ జట్టు ప్రస్తుతం ఐదో స్థానంలో ఉండి, ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం తీవ్రంగా పోరాడుతుంది. ఇలాంటి సమయంలో మాక్నీల్ వంటి యువ ఆల్‌రౌండర్ రాక జట్టుకు అదనపు బలం ఇవ్వొచ్చని సీఎస్‌కే అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


