రొనాల్డో 'పాజిటివ్'

Corona Positive To Portugal football Player Cristiano Ronaldo - Sakshi

కరోనా బారిన పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌

లిస్బన్‌: క్రీడా ప్రపంచంలోని మరో మేటి ప్లేయర్‌ కరోనా మహమ్మారి బారిన పడ్డాడు. పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ జట్టు స్టార్‌ ఫార్వర్డ్, యువెంటస్‌ క్లబ్‌ ప్లేయర్‌ క్రిస్టియానో రొనాల్డోకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దాంతో యూనియన్‌ ఆఫ్‌ యూరోపియన్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్స్‌ (యూఈఎఫ్‌ఏ) నేషన్స్‌ లీగ్‌ టోర్నీలో భాగంగా నేడు స్వీడన్‌తో జరిగే మ్యాచ్‌లో 35 ఏళ్ల రొనాల్డో పాల్గొనడం లేదని పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ సమాఖ్య తెలిపింది. ‘రొనాల్డోకు ఎలాంటి లక్షణాలు లేవు. ప్రస్తుతం అతను స్వీయనిర్బంధంలో ఉన్నాడు. రొనాల్డోతో కలిసి ప్రాక్టీస్‌ చేసిన జట్టు సభ్యులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. అందరికీ నెగెటివ్‌ ఫలితం వచ్చింది.

వారందరూ స్వీడన్‌తో జరిగే మ్యాచ్‌లో బరిలోకి దిగుతారు’ అని పోర్చుగల్‌ సమాఖ్య వివరించింది. ఐదుసార్లు ‘వరల్డ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ పురస్కారం పొందిన రొనాల్డో ఇటీవల అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో 100 గోల్స్‌ పూర్తి చేసుకొని అత్యధిక గోల్స్‌ చేసిన క్రీడాకారుల జాబితాలో 101 గోల్స్‌తో రెండో స్థానంలో ఉన్నాడు. 109 గోల్స్‌తో ఇరాన్‌ ప్లేయర్‌ అలీ దాయి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. గతవారం నేషన్స్‌ లీగ్‌లో భాగంగా ఫ్రాన్స్‌తో 0–0తో ‘డ్రా’గా ముగిసిన మ్యాచ్‌లో... స్పెయిన్‌తో 0–0తో ‘డ్రా’గా ముగిసిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో రొనాల్డో పాల్గొన్నాడు. గతంలో ప్రపంచ నంబర్‌వన్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ నొవాక్‌ జొకోవిచ్, బ్రెజిల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ నెమార్, బాస్కెట్‌బాల్‌ స్టార్‌ కెవిన్‌ డురాంట్‌ కరోనా బారిన పడి కోలుకున్న వారిలో ఉన్నారు.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top