చికిత ఖాతాలో స్వర్ణం, రజతం | Chikitha Taniparthi shines with gold and silver medals | Sakshi
Sakshi News home page

చికిత ఖాతాలో స్వర్ణం, రజతం

Mar 28 2026 1:34 AM | Updated on Mar 28 2026 1:34 AM

Chikitha Taniparthi shines with gold and silver medals

బ్యాంకాక్‌: ఆసియా కప్‌ వరల్డ్‌ ర్యాంకింగ్‌ స్టేజ్‌–1 ఆర్చరీ టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ అమ్మాయి తనిపర్తి చికిత స్వర్ణ, రజత పతకాలతో మెరిసింది. శుక్రవారం ముగిసిన ఈ టోర్నీలో భారత ఆర్చర్లు మొత్తం 10 పతకాలు సాధించారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన 20 ఏళ్ల చికిత కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో రజత్‌ చౌహాన్‌తో కలిసి పసిడి పతకం సొంతం చేసుకుంది. చికిత, రాజ్‌ కౌర్, తేజల్‌ సాల్వేలతో కూడిన మహిళల కాంపౌండ్‌ జట్టు రజత పతకాన్ని దక్కించుకుంది. 

మిక్స్‌డ్‌ టీమ్‌ ఫైనల్లో చికిత–రజత్‌ చౌహాన్‌ (భారత్‌) ద్వయం 158–156తో ఫాతిన్‌ నూర్‌ఫతే–జువైది (మలేసియా) జంటపై గెలిచింది. కాంపౌండ్‌ టీమ్‌ ఫైనల్లో చికిత, రాజ్‌ కౌర్, తేజల్‌ బృందం 227–229తో విక్టోరియా, డయానా, రొక్సానాలతో కూడిన కజకిస్తాన్‌ జట్టు చేతిలో ఓడి రజత పతకాన్ని గెల్చుకుంది. పురుషుల రికర్వ్‌ టీమ్‌ ఫైనల్లో దేవాంగ్‌ గుప్తా, సుఖ్‌చెయిన్‌ సింగ్, జుయెల్‌ సర్కార్‌ (భారత్‌) బృందం 4–5తో కరిమోవ్, ఇల్ఫాత్, దౌలత్‌కెల్దీ (కజకిస్తాన్‌) జట్టు చేతిలో ఓడి రజతం నెగ్గింది. 

మహిళల కాంపౌండ్‌ వ్యక్తిగత కాంస్య పతక మ్యాచ్‌లో తేజల్‌ సాల్వే 144–138తో మరియాపై గెలిచింది. పురుషుల కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో భారత ఆర్చర్లు ఉదయ్‌ కంబోజ్‌ (స్వర్ణం), ప్రథమేశ్‌ (రజతం), రజత్‌ (కాంస్యం) క్లీన్‌స్వీప్‌ చేశారు. ఫైనల్లో ఉదయ్‌ కంబోజ్‌ 145–144తో ప్రథమేశ్‌పై, కాంస్య పతక మ్యాచ్‌లో రజత్‌ చౌహాన్‌ 145–144తో పీరావత్‌ (థాయ్‌లాండ్‌)పై నెగ్గారు. మహిళల రికర్వ్‌ వ్యక్తిగత విభాగం ఫైనల్లో రిధి (భారత్‌) 2–6 సెట్‌లతో ఒయున్‌ బసాన్‌దోర్జ్‌ (మంగోలియా) చేతిలో ఓడి రజతం సొంతం చేసుకుంది. బుధవారం భారత పురుషుల కాంపౌండ్‌ జట్టు, భారత మహిళల రికర్వ్‌ జట్టు కాంస్య పతకాలు సాధించాయి.  

Advertisement
 
Advertisement
Advertisement