నన్ను ఎవరు తొలగిస్తారు?.. పాక్‌ చీఫ్‌ సెలక్టర్‌ | Chief Selector Aaqib Javed Breaks Silence On His Exit From PCB | Sakshi
Sakshi News home page

నన్ను ఎవరు తొలగిస్తారు?.. పాక్‌ చీఫ్‌ సెలక్టర్‌

Sep 16 2026 10:32 AM | Updated on Sep 16 2026 10:51 AM

Chief Selector Aaqib Javed Breaks Silence On His Exit From PCB

ఆకిబ్‌- నక్వీ (PC: PCB/X)

పాకిస్తాన్‌ క్రికెట్‌ మరోసారి వార్తల్లోకెక్కింది. ఇటీవల ఇంగ్లండ్‌ పర్యటనలో టెస్టుల్లో పాక్‌ జట్టుకు ఘోర పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. ఆతిథ్య జట్టు చేతిలో బాబర్‌ ఆజం బృందం 3-0తో క్లీన్‌స్వీప్‌ అయింది.

ఏం చేసినా ఫలితం శూన్యం
అయితే, మూడో టెస్టుకు ముందే పాక్‌ క్రికెట్‌ బోర్డు (PCB) జట్టుకు సంబంధించి గణనీయమైన మార్పులు చేసింది. ఏడుగురు ఆటగాళ్లను జట్టు నుంచి విడుదల చేయడంతో పాటు.. టెస్టు కోచ్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌, బౌలింగ్‌ కోచ్‌ ఉమర్‌ గుల్‌లను తమ పదవుల నుంచి తొలగించింది.

ఇన్ని మార్పుల తర్వాత కూడా పాక్‌ ఆట తీరులో మార్పు రాలేదు. ఇంగ్లండ్‌ చేతిలో మూడో టెస్టులోనూ ఓడి.. పరాజయాన్ని పరిపూర్ణం చేసుకుంది. ఈ నేపథ్యంలో పాక్‌ బోర్డు తీరుపై.. ముఖ్యంగా చీఫ్‌ సెలక్టర్‌ ఆకిబ్‌ జావేద్‌ వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.

పాకిస్తాన్‌ మాజీ హెడ్‌కోచ్‌, ఆస్ట్రేలియా దిగ్గజం జేసన్‌ గిల్లెస్పి సైతం ఆకిబ్‌పై మండిపడ్డాడు. అతడు వచ్చిన తర్వాతే పాక్‌ క్రికెట్‌ నాశనం మొదలైందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. తప్పులను ఒప్పుకోకుండా... నెపాన్ని మాజీ కోచ్‌లమైన నాపై, గ్యారీ కిర్‌స్టెన్‌పై నెట్టేస్తున్నాడంటూ ఆరోపించాడు.

వేటుకు రంగం సిద్ధం
ఈ పరిణామాల నేపథ్యంలో పీసీబీ చీఫ్‌ మోసిన్‌ నక్వీ సైతం ఆకిబ్‌ జావేద్‌పై గుర్రుగా ఉన్నాడని.. అతడిపై వేటు వేసేందుకు బోర్డు రంగం సిద్ధం చేసిందని వార్తలు వచ్చాయి. ప్రక్షాళనలో భాగంగా ఆకిబ్‌ తొలగింపు లాంఛనమేనని ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఆకిబ్‌ జావేద్‌ ఈ పరిణామాలపై తాజాగా స్పందించాడు.

నన్ను ఎవరూ తొలగించడం లేదు
పాక్‌ మీడియా డాన్‌ న్యూస్‌ ప్రకారం.. ‘నేను నా చీఫ్‌ సెలక్టర్‌ పదవికి రాజీనామా చేయడం లేదు. బోర్డులో నేను పోషిస్తున్న ఇతర బాధ్యతల నుంచి కూడా వైదొలగడం లేదు. మీరు విన్నవన్నీ అవాస్తవాలు, కల్పితాలు. నన్ను ఎవరూ తొలగించడం లేదు’’ అని ఆకిబ్‌ జావేద్‌ చెప్పినట్లు తెలుస్తోంది.

కాగా 2024లో ఆకిబ్‌ జావేద్‌ పాక్‌ జట్టు చీఫ్‌ సెలక్టర్‌గా వచ్చాడు. అతడి హయాంలో ఇప్పటి వరకు పాకిస్తాన్‌ 101 మ్యాచ్‌లు ఆడి 53 గెలిచింది. తద్వారా విజయాల శాతం 52.47గా నమోదైంది. 

ఆకిబ్‌ రావడానికి ముందు రెండేళ్ల కాలంలో పాక్‌ జట్టు 78 మ్యాచ్‌లలో కేవలం 33 గెలిచింది. దీనిని బట్టి ఆకిబ్‌ వచ్చిన తర్వాతే పాక్‌ పరిస్థితి కాస్త మెరుగుపడినట్లు కనిపిస్తుంది. కాబట్టి అతడిని మరికొంతకాలం కొనసాగించాలని పీసీబీ యోచిస్తున్నట్లు సమాచారం.

చదవండి: అతడిని ఎలా ఆడిస్తారు?.. వైభవ్‌తో పోటీపై సంజూ స్పందన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement