SRH vs CSK: సన్‌ సీన్‌ మారలేదు | Chennai Super Kings beat Sunrisers Hyderabad by 7 wickets | Sakshi
Sakshi News home page

SRH vs CSK: సన్‌ సీన్‌ మారలేదు

Apr 29 2021 3:49 AM | Updated on Apr 29 2021 8:59 AM

Chennai Super Kings beat Sunrisers Hyderabad by 7 wickets - Sakshi

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. అన్ని రంగాల్లో విఫలమవుతున్న జట్టు మరో పరాజయంతో పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలోనే కొనసాగుతోంది. అద్భుత ఫామ్‌లో చెలరేగుతున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ ముందు హైదరాబాద్‌ తలవంచింది. బ్యాటింగ్‌లో తడబడుతూనే ఒక మాదిరి స్కోరు చేసిన ‘సన్‌’ పస లేని బౌలింగ్‌తో మ్యాచ్‌ను ప్రత్యర్థికి అప్పగించింది. సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన ధోని సేన ముందు ఏ దశలోనూ సన్‌రైజర్స్‌ నిలబడలేకపోయింది.   

న్యూఢిల్లీ: గత సీజన్‌లో పేలవ ఫామ్‌ కనబర్చిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఈ ఏడాది మాత్రం తమ జోరు కొనసాగిస్తోంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై 7 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను చిత్తు చేసింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. మనీశ్‌ పాండే (46 బంతుల్లో 61; 5 ఫోర్లు, 1 సిక్స్‌), డేవిడ్‌ వార్నర్‌ (55 బంతుల్లో 57; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించగా... కేన్‌ విలియమ్సన్‌ (10 బంతుల్లో 26 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌) చివర్లో ధాటిగా ఆడాడు. పాండే, వార్నర్‌ రెండో వికెట్‌కు 87 బంతుల్లో 106 పరుగులు జోడించారు. అనంతరం చెన్నై 18.3 ఓవర్లలో 3 వికెట్లకు 173 పరుగులు చేసి విజయాన్నందుకుంది. రుతురాజ్‌ గైక్వాడ్‌ (44 బంతుల్లో 75; 12 ఫోర్లు), డు ప్లెసిస్‌ (38 బంతుల్లో 56; 6 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీలతో జట్టును నడిపించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 78 బంతుల్లోనే 129 పరుగులు జోడించారు.  

రాణించిన పాండే...
సన్‌రైజర్స్‌ ఆరంభంలోనే బెయిర్‌స్టో (7) వికెట్‌ కోల్పోయింది. సున్నా వద్ద అతను ఇచ్చిన క్యాచ్‌ను ధోని వదిలేసినా... బెయిర్‌స్టో ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. అనంతరం మూడో స్థానంలో వచ్చిన పాండే కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. గత రెండు మ్యాచ్‌లలో అవకాశం దక్కని పాండే పునరాగమనంలో పట్టుదల కనబరుస్తూ కొన్ని చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. అలీ బౌలింగ్‌లో అతను కొట్టిన భారీ సిక్సర్‌కు కొత్త బంతిని తెప్పించాల్సి వచ్చింది. అయితే 35 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న పాండే తర్వాతి 10 బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేయగలిగాడు.  

వార్నర్‌ తడబాటు...
ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన, విధ్వంసక బ్యాట్స్‌మన్‌లలో ఒకడైన వార్నర్‌ ఈ మ్యాచ్‌లో ఆడిన ఇన్నింగ్స్‌ ఆశ్చర్యపరచింది. టాపార్డర్‌ విఫలమైతే రైజర్స్‌ కుప్పకూలిపోతోందన్న ముందు జాగ్రత్త కూడా అందుకు కారణం కావచ్చు.  తన 11వ బంతికి తొలి ఫోర్‌ కొట్టిన వార్నర్‌ మరో 14 బంతులకుగానీ మరో ఫోర్‌ కొట్టలేకపోయాడు. అర్ధ సెంచరీ చేరుకునే వరకు ఒక్కసారి కూడా అతని స్ట్రయిక్‌రేట్‌ 100 దాటకపోవడం విశేషం. ఎట్టకేలకు ఇన్‌గిడి బౌలింగ్‌లో సిక్స్‌ కొట్టిన వార్నర్‌... జడేజా వేసిన తర్వాతి ఓవర్లో మరో భారీ సిక్సర్‌తో 50 బంతుల్లో హాఫ్‌ సెంచరీని అందుకున్నాడు. అతని 304 మ్యాచ్‌ల టి20 కెరీర్‌లో ఇది 82వ హాఫ్‌ సెంచరీ కాగా... అన్నింటికంటే నెమ్మదైనది ఇదే కావడం విశేషం.  

విలియమ్సన్‌ మెరుపులు...
చెన్నై బౌలర్లు మధ్య ఓవర్లలో కట్టడి చేయడంతోపాటు వార్నర్, పాండేలను ఇన్‌గిడి ఒకే ఓవర్లో అవుట్‌ చేయడంతో రైజర్స్‌ సాధారణ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించింది. అయితే విలియమ్సన్‌ ఒక్కసారిగా సీన్‌ మార్చేశాడు. శార్దుల్‌ వేసిన 19వ ఓవర్లో అతను వరుస బంతుల్లో 4, 6, 4, 4 బాదగా.... స్యామ్‌ కరన్‌ వేసిన 20వ ఓవర్‌ చివరి రెండు బంతుల్లో కేదార్‌ జాదవ్‌ (12 నాటౌట్‌) వరుసగా ఫోర్, సిక్స్‌ కొట్టాడు. ఫలితంగా స్కోరు 171 పరుగులకు చేరింది.  

ఓపెనర్లు పోటీ పడుతూ...
ఛేదనలో చెన్నై అలవోకగా ముందుకు దూసుకుపోయింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్, డు ప్లెసిస్‌ శతక భాగస్వామ్యంతో జట్టును నడిపించగా, వీరిద్దరిని నిలువరించడం రైజర్స్‌ బౌలర్ల వల్ల కాలేదు. ఖలీల్‌ ఓవర్లో ప్లెసిస్‌... సుచిత్‌ ఓవర్లో రుతురాజ్‌ రెండేసి ఫోర్లు కొట్టారు. పవర్‌ప్లేలో 50 పరుగులు చేసిన చెన్నై ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించింది. సుచిత్‌ తర్వాతి ఓవర్లో వీరిద్దరు 17 పరుగులు రాబట్టారు. 32 బంతుల్లోనే డు ప్లెసిస్‌ అర్ధసెంచరీ పూర్తయింది. లీగ్‌లో అతనికి ఇది వరుసగా మూడో అర్ధ సెంచరీ కావడం విశేషం.

సుచిత్‌ వేసిన తర్వాతి ఓవర్లో వరుస బంతుల్లో 4, 4, 4 కొట్టిన రుతురాజ్‌ కూడా 36 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీని చేరుకున్నాడు. ఇదే ఊపులో రషీద్‌ వేసిన తర్వాతి ఓవర్లో కూడా రుతురాజ్‌ 3 ఫోర్లు కొట్టడం విశేషం. అయితే అదే ఓవర్‌ చివరి బంతికి అతను క్లీన్‌బౌల్డ్‌ కావడంతో సూపర్‌ కింగ్స్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. రషీద్‌ తన చివరి ఓవర్లో కూడా వరుస బంతుల్లో మొయిన్‌ అలీ (15), డు ప్లెసిస్‌లను అవుట్‌ చేశాడు. అయితే చేయాల్సిన పరుగులు తక్కువగా ఉండటంతో జడేజా (7 నాటౌట్‌), రైనా (17 నాటౌట్‌) ఇబ్బంది లేకుండా మరో 9 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను ముగించారు.   

వార్నర్‌ @ 10,000
డేవిడ్‌ వార్నర్‌ టి20ల్లో 10 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ ఫార్మాట్‌లో ఈ ఘనత సాధించిన నాలుగో బ్యాట్స్‌మన్‌గా (10,017)  నిలిచా డు. వార్నర్‌కంటే ముందు గేల్‌ (13,839), పొలార్డ్‌ (10,694), షోయబ్‌ మలిక్‌ (10,488) ఈ మైలురాయిని దాటారు. తాజా మ్యాచ్‌లో 2 సిక్సర్లు బాదిన వార్నర్‌ ఐపీఎల్‌లో 200 సిక్సర్లు కొట్టిన 8వ ఆటగాడిగా నిలవగా... ఐపీఎల్‌ లో 50వ అర్ధ సెంచరీని కూడా అందుకున్నాడు. లీగ్‌లో అతని ఖాతాలో 4 శతకాలు ఉన్నాయి.   

స్కోరు వివరాలు
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: వార్నర్‌ (సి) జడేజా (బి) ఇన్‌గిడి 57; బెయిర్‌స్టో (సి) చహర్‌ (బి) స్యామ్‌ కరన్‌ 7; మనీశ్‌ పాండే (సి) డు ప్లెసిస్‌ (బి) ఇన్‌గిడి 61; విలియమ్సన్‌ (నాటౌట్‌) 26; కేదార్‌ జాదవ్‌ (నాటౌట్‌) 12; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 171.
వికెట్ల పతనం: 1–22, 2–128, 3–134.
బౌలింగ్‌: దీపక్‌ చహర్‌ 3–0–21–0, స్యామ్‌ కరన్‌ 4–0–30–1, శార్దుల్‌ ఠాకూర్‌ 4–0–44–0, మొయిన్‌ అలీ 2–0–16–0, ఇన్‌గిడి 4–0–35–2, జడేజా 3–0–23–0.

చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: రుతురాజ్‌ గైక్వాడ్‌ (బి) రషీద్‌ 75; డు ప్లెసిస్‌ (ఎల్బీ) (బి) రషీద్‌ 56; మొయిన్‌ అలీ (సి) జాదవ్‌ (బి) రషీద్‌ 15; జడేజా (నాటౌట్‌) 7; రైనా (నాటౌట్‌) 17; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (18.3 ఓవర్లలో 3 వికెట్లకు) 173.  
వికెట్ల పతనం: 1–129, 2–148, 3–148. బౌలింగ్‌: సందీప్‌ శర్మ 3.3–0–24–0, ఖలీల్‌ అహ్మద్‌ 4–0–36–0, సిద్ధార్థ్‌ కౌల్‌ 4–0–32–0, సుచిత్‌ 3–0–45–0, రషీద్‌ ఖాన్‌ 4–0–36–3.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement