US Open 2022: అల్‌కరాజ్‌ అదరహో

Carlos Alcaraz Beats Casper Ruud To Win US Open Title, Ascends To World No 1 - Sakshi

యూఎస్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ కైవసం

కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌తోపాటు ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌నూ అందుకున్న స్పెయిన్‌ టీనేజర్‌

ఫైనల్లో కాస్పర్‌ రూడ్‌పై విజయం

రూ. 20 కోట్ల 71 లక్షల ప్రైజ్‌మనీ సొంతం  

న్యూయార్క్‌: పురుషుల టెన్నిస్‌లో కార్లోస్‌ అల్‌కరాజ్‌ రూపంలో కొత్త కెరటం         వచ్చింది. సీజన్‌ చివరి గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌ యూఎస్‌ ఓపెన్‌లో 19 ఏళ్ల ఈ స్పెయిన్‌ టీనేజర్‌ అద్భుతం చేశాడు. ఈ సీజన్‌లో తాను సాధించిన విజయాలు గాలివాటమేమీ కాదని నిరూపిస్తూ అల్‌కరాజ్‌ ఏకంగా గ్రాండ్‌స్లామ్‌ చాంపియన్‌గా అవతరించాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ అల్‌కరాజ్‌ 6–4, 2–6, 7–6 (7/1), 6–3తో ప్రపంచ ఏడో ర్యాంకర్‌ కాస్పర్‌ రూడ్‌ (నార్వే)పై విజయం సాధించాడు.

ఈ గెలుపుతో అల్‌కరాజ్‌ కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సాధించడంతోపాటు సోమవారం విడుదల చేసిన అసోసియేషన్‌ ఆఫ్‌ టెన్నిస్‌ ప్రొఫెషనల్స్‌ (ఏటీపీ) ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు ఎగబాకి నంబర్‌వన్‌ ర్యాంక్‌ను అందుకున్నాడు. రన్నరప్‌ కాస్పర్‌ రూడ్‌ ఐదు స్థానాలు పురోగతి సాధించి కెరీర్‌ బెస్ట్‌ రెండో ర్యాంక్‌లో నిలిచాడు. విజేతగా నిలిచిన అల్‌కరాజ్‌కు 26 లక్షల డాలర్లు (రూ. 20 కోట్ల 71 లక్షలు)... రన్నరప్‌ కాస్పర్‌ రూడ్‌కు 13 లక్షల డాలర్లు (రూ. 10 కోట్ల 35 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.

అల్‌కరాజ్‌ కెరీర్‌లో ఆడిన తొలి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్లో టైటిల్‌ నెగ్గగా... కాస్పర్‌ రూడ్‌కు రెండో గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్లోనూ ఓటమి ఎదురైంది. ఈ ఏడాది ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లో రాఫెల్‌ నాదల్‌ చేతిలో కాస్పర్‌ రూడ్‌ ఓడిపోయి రన్నరప్‌గా నిలిచాడు. నాదల్‌ (19 ఏళ్లు; 2005లో ఫ్రెంచ్‌ ఓపెన్‌) తర్వాత గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలిచిన పిన్న వయస్కుడిగా... సంప్రాస్‌ (19 ఏళ్లు; 1990లో యూఎస్‌ ఓపెన్‌) తర్వాత యూఎస్‌ ఓపెన్‌ గెలిచిన పిన్న వయస్కుడిగా అల్‌కరాజ్‌ గుర్తింపు పొందాడు.  

అదే జోరు 
ఫైనల్‌ చేరే క్రమంలో ప్రిక్వార్టర్‌ ఫైనల్లో, క్వార్టర్‌ ఫైనల్లో, సెమీఫైనల్లో ఐదు సెట్‌లపాటు పోరాడిన గెలిచిన అల్‌కరాజ్‌ తుది సమరంలోనూ పట్టుదలతో ఆడాడు. పదునైన రిటర్న్‌లు, శక్తివంతమైన గ్రౌండ్‌ స్ట్రోక్‌లు, డ్రాప్‌ షాట్‌లు, బేస్‌లైన్‌ ఆటతో అలరించిన అల్‌కరాజ్‌ 3 గంటల 20 నిమిషాల్లో కాస్పర్‌ రూడ్‌ ఆట కట్టించాడు. తొలి సెట్‌లోని మూడో గేమ్‌లో రూడ్‌   సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన అల్‌కరాజ్‌ ఆ తర్వాత తన సర్వీస్‌లు నిలబెట్టుకొని సెట్‌ దక్కించుకున్నాడు. అయితే రెండో సెట్‌లో రూడ్‌ తేరుకొని నాలుగో గేమ్‌లో, ఆరో గేమ్‌లో అల్‌కరాజ్‌ సర్వీస్‌లను బ్రేక్‌ చేసి సెట్‌ను గెల్చుకున్నాడు.

మూడో సెట్‌ హోరాహోరీగా సాగింది. రూడ్‌ 6–5తో ఆధిక్యంలో నిలిచి అల్‌కరాజ్‌ సర్వ్‌ చేసిన 12వ గేమ్‌లో రెండుసార్లు సెట్‌ పాయింట్లు సంపాదించాడు. అయితే అల్‌కరాజ్‌ పట్టుదలతో ఆడి ఐదుసార్లు డ్యూస్‌ల తర్వాత తన సర్వీస్‌ను నిలబెట్టుకొని స్కోరును 6–6తో సమం చేశాడు. అనంతరం టైబ్రేక్‌లో ఈ స్పెయిన్‌ యువతార పైచేయి సాధించి మూడో సెట్‌ను సాధించాడు. నాలుగో సెట్‌లోనూ అల్‌కరాజ్‌ జోరు కొనసాగించి ఆరో గేమ్‌లో రూడ్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసి 4–2తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత అల్‌కరాజ్‌ తన సర్వీస్‌లను కాపాడుకొని సెట్‌తోపాటు మ్యాచ్‌ను గెల్చుకున్నాడు. 


 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top