సూపర్‌ సంజీత్‌...

Boxer Sanjeet Wins Gold in Asian Boxing Championship - Sakshi

ఆసియా బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గిన భారత బాక్సర్‌

రజతాలు సాధించిన అమిత్, శివ థాపా

దుబాయ్‌: ప్రత్యర్థి రికార్డు ఘనంగా ఉన్నా... అవేమీ పట్టించుకోకుండా తన పంచ్‌ పవర్‌తో భారత హెవీవెయిట్‌ బాక్సర్‌ సంజీత్‌ సత్తా చాటుకున్నాడు. ఆసియా సీనియర్‌ బాక్సింగ్‌ చాంపియన్‌ షిప్‌ పురుషుల 91 కేజీల విభాగంలో సంజీత్‌ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. సోమవారం ముగిసిన ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో 91 కేజీల ఫైనల్లో సంజీత్‌ 4–1తో 2016 రియో ఒలింపిక్స్‌ రజత పతక విజేత, మూడుసార్లు ఆసియా చాంపియన్‌ వాసిలీ లెవిట్‌ (కజకిస్తాన్‌)పై సంచలన విజయం సాధించాడు.
 
► మరోవైపు 52 కేజీల విభాగంలో డిఫెండింగ్‌ చాంపియన్‌ అమిత్‌ పంఘాల్‌... 64 కేజీల విభాగంలో శివ థాపాలకు నిరాశ ఎదురైంది. వీరిద్దరూ తీవ్రంగా పోరాడినా చివరకు రజత పతకాలతో సరిపెట్టుకున్నారు. ఫైనల్స్‌లో అమిత్‌ 2–3తో 2016 రియో ఒలింపిక్స్‌ చాంపియన్, ప్రస్తుత ప్రపంచ చాంపియన్‌ షఖోబిదిన్‌ జోయ్‌రోవ్‌ (ఉజ్బెకిస్తాన్‌) చేతిలో... శివ థాపా 2–3తో బాతర్‌సుఖ్‌ చిన్‌జోరిగ్‌ (మంగోలియా) చేతిలో ఓడిపోయారు.  
     
► 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌ ఫైనల్లోనూ జోయ్‌రోవ్‌ చేతిలో ఓడిన అమిత్‌ ఈసారి మాత్రం ప్రత్యర్థికి తీవ్రమైన ప్రతిఘటన ఇచ్చాడు. ఇద్దరూ ఎక్కడా జోరు తగ్గించుకోకుండా ఒకరిపై ఒకరు పంచ్‌లు విసురుకున్నారు. అమిత్‌ ఆటతీరు చూశాక విజయం అతడినే వరిస్తుందనిపించినా... బౌట్‌ జడ్జిలు మాత్రం జోయ్‌రోవ్‌ ఆధిపత్యం చలాయించాడని భావించారు. తుది ఫలితంపై భారత బృందం జ్యూరీకి అప్పీల్‌ చేసింది. అయితే భారత అప్పీల్‌ను జ్యూరీ తోసిపుచ్చింది. దాంతో జోయ్‌రోవ్‌కే స్వర్ణం ఖాయమైంది.  
     
► ఓవరాల్‌గా ఈ టోర్నమెంట్‌లో భారత్‌కు 15 పతకాలు వచ్చాయి. పురుషుల విభాగంలో ఒక స్వర్ణం, రెండు రజతాలు, రెండు కాంస్యాలు... మహిళల విభాగంలో ఒక స్వర్ణం, మూడు రజతాలు, ఆరు కాంస్యాలు లభించాయి. ఆసియా చాంపియన్‌షిప్‌ చరిత్రలో భారత్‌కిదే అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం. 2019లో భారత్‌ అత్యధికంగా 13 పతకాలు సాధించింది.


అమిత్‌, శివ థాపా

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top