IND Vs AUS 3rd T20: ఉప్పల్‌ 'దంగల్‌'.. గత రికార్డులు ఎలా ఉన్నాయంటే?

Big Fight Between IND Vs AUS 3rd T20I Rajiv Gandhi Stadium After 3 Years - Sakshi

భారత్, ఆస్ట్రేలియా జట్ల అమీతుమీ

నగరంలో నేడు క్రికెట్‌ సమరం 

‘రన్‌’రంగానికి అభిమానుల తహతహ 

రాత్రి 7 గంటల నుంచి మ్యాచ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: నగర క్రీడాభిమానుల మూడేళ్ల నిరీక్షణకు నేడు  తెరపడనుంది. ఉప్పల్‌ స్టేడియం వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య చివరి టీ20 మ్యాచ్‌ జరగనుంది. మొహాలీలో ఆస్ట్రేలియా పైచేయి సాధించగా.. నాగ్‌పూర్‌లో భారత్‌ మెరిసింది. ఇక చివరిదైన మూడో మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోవడానికి రోహిత్‌ సేన, ఫించ్‌ బృందం సిద్ధమయ్యాయి. శనివారం సాయంత్రం రెండు జట్లూ హైదరాబాద్‌కు చేరుకున్నాయి. ఆదివారం మధ్యాహ్నం తర్వాత నేరుగా ఉప్పల్‌ స్టేడియానికి వెళ్లి వ్యూహాలకు పదును పెట్టుకోనున్నాయి. 

ఆదివారం సెలవు దినం కావడం.. సిరీస్‌ను తేల్చే మ్యాచ్‌ కావడం.. మూడేళ్ల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌ను వీక్షించే అవకాశం రావడం... ఈ నేపథ్యంలో ఉప్పల్‌ మైదానం ‘హౌస్‌ఫుల్‌’ కానుంది. ఇప్పటికే మ్యాచ్‌ టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. టికెట్లు దొరకని అభిమానులు ఎలాగైనా తమ అభిమానుల ఆటను ప్రత్యక్షంగా చూసేందుకు ఇంకా ప్రయత్నాలు కొనసాగిస్తుండగా.... టికెట్లపై ఆశలు వదులుకున్న వారు మాత్రం ఇంట్లో టీవీల ముందు కూర్చోని చూసేందుకు... లేదంటే మొబైల్స్‌లో వీక్షించడానికి... హోటల్స్‌లో పెద్ద స్క్రీన్‌లపై ఆస్వాదించడానికి సిద్ధమైపోయారు.  

సమరం... సమం.. 
►2005 నుంచి ఉప్పల్‌ స్టేడియంలో అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు మూడు ఫార్మాట్‌లలో (వన్డే, టెస్టు, టి20) కలిపి 12 అంతర్జాతీయ మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ఆరు వన్డేలు, ఐదు టెస్టులు, ఒక టి20 మ్యాచ్‌ ఉన్నాయి. అయిదు టెస్టుల్లో భారత్‌ నాలుగింటిలో నెగ్గగా, మరో మ్యాచ్‌ ‘డ్రా’ అయింది. ఇక ఆరు వన్డేల్లో భారత్‌ మూడింటిలో గెలిచి, మరో మూడింటిలో ఓడిపోయింది. ఏకైక టీ20లో భారత్‌నే విజయం వరించింది.  
►ఉప్పల్‌ వేదికపై భారత్, ఆస్ట్రేలియా జట్లు ముఖాముఖిగా నాలుగుసార్లు (మూడు వన్డేలు, ఒక టెస్టు) తలపడ్డాయి. రెండుసార్లు భారత్‌... రెండుసార్లు ఆస్ట్రేలియా గెలిచి సమవుజ్జీగా ఉన్నాయి. టీ20 ఫార్మాట్‌లో మాత్రం ఈ రెండు జట్ల మధ్య సిటీలో తొలిసారి పోరు జరగనుంది.  
►2007 అక్టోబర్‌ 5న జరిగిన వన్డే మ్యాచ్‌లో ధోని కెప్టెన్సీలోని భారత జట్టు 47 పరుగుల తేడాతో ఓడిపోయింది. ముందుగా రికీ పాంటింగ్‌ నాయకత్వంలోని ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 7 వికెట్లకు 290 పరుగులు సాధించింది. మాథ్యూ హేడెన్‌ (60; 10 ఫోర్లు), మైకేల్‌ క్లార్క్‌ (59; 4 ఫోర్లు), ఆండ్రూ సైమండ్స్‌ (89; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం భారత్‌ 47.4 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. యువరాజ్‌ సింగ్‌ (121; 12 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఒంటరి పోరాటంతో సెంచరీ 
సాధించాడు. 
►2009 నవంబర్‌ 5న ఈ వేదికపై రెండోసారి భారత్, ఆస్ట్రేలియా జట్లు వన్డేలో తలపడ్డాయి. ఈసారి ఆస్ట్రేలియా 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 4 వికెట్లకు 350 పరుగులు సాధించింది. షేన్‌ వాట్సన్‌ (93; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు), కామెరాన్‌ వైట్‌ (57, 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేయగా... షాన్‌ మార్‌‡్ష (112; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీతో అలరించాడు. 351 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 49.4 ఓవర్లలో 347 పరుగులకు ఆలౌటైంది. దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ (141 బంతుల్లో 175; 19 ఫోర్లు, 4 సిక్స్‌లు) గొప్పగా ఆడి సెంచరీ సాధించినా భారత్‌ను విజయతీరానికి చేర్చలేకపోయాడు.  
►2013 మార్చి 2 నుంచి 5 వరకు ఇదే వేదికపై భారత్, ఆస్ట్రేలియా టెస్టు ఆడగా... భారత్‌ ఇన్నింగ్స్‌ 135 పరుగుల తేడాతో గెలిచింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 237 పరుగులు చేయగా... భారత్‌ 503 పరుగులు సాధించింది. మురళీ విజయ్‌ (167; 23 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ, చతేశ్వర్‌ పుజారా (204; 30 ఫోర్లు, 1 సిక్స్‌) డబుల్‌ సెంచరీ చేశారు. 266 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన 
ఆస్ట్రేలియా 131 పరుగులకే కుప్పకూలింది. 
►2019 మార్చి 2న భారత్, ఆస్ట్రేలియా జట్లు మూడోసారి వన్డేలో పోటీపడగా... ఈసారి భారత్‌ను విజయం వరించింది. ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 7 వికెట్లకు 236 పరుగులు చేసింది. ఉస్మాన్‌ ఖాజా (50; 5 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీ సాధించాడు. అనంతరం భారత్‌ 48.2 ఓవర్లలో 4 వికెట్లకు 240 పరుగులు చేసి విజయం సాధించింది. కేదార్‌ జాదవ్‌ (81 నాటౌట్‌; 9 ఫోర్లు, 1 సిక్స్‌), ధోని (59 నాటౌట్‌; 6 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీలతో భారత్‌ను గెలిపించారు.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top