
వచ్చే ఐపీఎల్ సీజన్‌కు ముందు వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఆర్సీబీని భయపెడుతున్నాడు. గత సీజన్‌లో ఆర్సీబీని ఛాంపియన్‌గా నిలపడంలో కీలకపాత్ర పోషించిన భువీ.. ప్రస్తుతం జరుగుతున్న ఉత్తర్‌ప్రదేశ్ టీ20 లీగ్‌లో చెత్త ప్రదర్శనలు చేస్తూ ఆందోళన కలిగిస్తున్నాడు. ఈ లీగ్‌లో లక్నో ఫాల్కన్స్‌కు ఆడుతున్న భువీ.. ఇవాళ (ఆగస్ట్ 27) మీరట్ మెవెరిక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ ఓవర్‌లో ఏకంగా 29 పరుగులు సమర్పించుకుని ఆర్సీబీ యాజమాన్యాన్ని, ఆ ఫ్రాంచైజీ అభిమానులను ఉలిక్కి పడేలా చేశాడు.
భువీపై ఆర్సీబీ వచ్చే సీజన్‌లో కూడా ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో అతడి నుంచి ఇలాంటి చెత్త ప్రదర్శనలు ఆర్సీబీ యాజమాన్యాన్ని తప్పక కలవరపెడతాయి. భువీ చెత్త ప్రదర్శన ఈ ఒక్క ఓవర్‌కే పరిమితం కాలేదు. ఈ సీజన్‌లో అతనాడిన 5 మ్యాచ్‌ల్లోనూ ఇలాగే ఉంది. 8కిపైగా ఎకానమీతో, కేవలం నాలుగు వికెట్లు మాత్రమే తీశాడు.
మీరట్‌తో జరిగిన మ్యాచ్‌లో భువీ తన తొలి మూడు ఓవర్లు బాగానే వేశాడు. అందులో కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చాడు. నాలుగో ఓవర్‌లోనే భువీని ప్రత్యర్థి బ్యాటర్ రితురాజ్ శర్మ ఆడుకున్నాడు. మొదటి బంతిని సిక్సర్‌గా మలిచిన రితు.. ఆతర్వాత వరుసగా నాలుగు బౌండరీలు కొట్టి, చివరి బంతికి మరో సిక్సర్ బాదాడు. ఈ ఓవర్‌లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టిన రితు 29 పరుగులు పిండుకున్నాడు. మొత్తంగా భువీ ఈ మ్యాచ్‌లో తన కోటా నాలుగు ఓవర్లు వేసి ఏకంగా 49 పరుగులు సమర్పించుకున్నాడు.
భువీతో పాటు మిగతా లక్నో బౌలర్లందరినీ కూడా చెడుగుడు ఆడుకున్న మీరట్ బ్యాటర్లు తమ జట్టుకు భారీ స్కోర్‌ను అందించారు. స్వస్తిక్ చికారా (55), రితురాజ్ శర్మ (74 నాటౌట్), రింకూ సింగ్ (57), రితిక్ వట్స్ (8 బంతుల్లో 35 నాటౌట్) చెలరేగడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది.
అనంతరం భారీ లక్ష్య ఛేదనలో చేతులెత్తేసిన లక్నో 18.2 ఓవర్లలో 140 పరుగులకే ఆలౌటైంది. జీషన్ అన్సారీ (4-0-23-3), యశ్ గార్గ్ (4-0-25-3), కార్తీక్ త్యాగి (2.2-0-9-2), విజయ్ కుమార్ (3-0-20-2) లక్నోను దెబ్బకొట్టారు. లక్నో ఇన్నింగ్స్‌లో సమీర్ చౌధరీ (46) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.