Aryna Sabalenka Life Story: అవమానించిన చోటే అదరగొట్టి.. ‘నేను ఆడ పులిని’! నిజమే మరి!

Belarus Tennis Star Aryna Sabalenka Inspirational Successful Journey - Sakshi

నాలుగేళ్ల క్రితం.. బెలారస్‌ దేశంలో ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం సాగింది. తీవ్ర నిరసనలు, పోరాటాలు జరిగాయి. సహజంగానే ప్రభుత్వం వాటిని అణచివేసేందుకు ప్రయత్నించింది. ఆ దేశంలోని ఎంతో మంది ప్రముఖులు తమ అభిప్రాయాలను వెల్లడించకుండా తటస్థంగా ఉండేందుకే ప్రయత్నించారు. 

కానీ 22 ఏళ్ల ఒక అంతర్జాతీయ క్రీడాకారిణి మాత్రం గట్టిగా తన గళాన్ని వినిపించింది. దేశాధ్యక్షుడు అలెగ్జాండర్‌ ల్యుకాన్షెకో వ్యవహరిస్తున్న తీరును తప్పు పట్టింది. మరో రెండేళ్ల తర్వాత ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా రష్యాపై తీవ్ర విమర్శలు కురుస్తున్న సమయంలో బెలారస్‌ మాత్రం యుద్ధంలో రష్యాకు మద్దతు పలికింది.

ఆ సమయంలోనూ ఆ ప్లేయర్‌ తమ ప్రభుత్వాన్ని, దేశాధ్యక్షుడిని తీవ్రంగా విమర్శించింది. ‘అమాయకులపై దాడులు చేసే యుద్ధాన్ని నేను సమర్థించను. అందుకే మా ప్రభుత్వాన్ని కూడా సమర్థించను’ అంటూ బహిరంగ ప్రకటన చేసింది.  

ఈ రెండు సందర్భాల్లోనూ ఆ మహిళా క్రీడాకారిణి తన కెరీర్‌ను పణంగా పెట్టింది. అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత దశకు వేగంగా ఎదుగుతున్న సమయంలో ఇలాంటి పనులు తనను ఇబ్బంది పెడతాయని తెలిసినా తాను నమ్మినదాని గురించి గట్టిగా మాట్లాడింది.  ఆమె పేరే.. అరీనా సబలెంకా. ఈ బెలారస్‌కు టెన్నిస్‌ స్టార్‌  రెండు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ను సాధించడం, వరల్డ్‌ నంబర్‌వన్‌ కావడం మాత్రమే కాదు.. ఆటతో పాటు తనకో ప్రత్యేక వ్యక్తిత్వం ఉందనీ నిరూపించింది. 

‘నేను ఆడ పులిని’.. కెరీర్‌ ఆరంభంలో సబలెంకా తన గురించి తాను చెప్పుకున్న మాట. అప్పటికి ఆమె పెద్ద ప్లేయర్‌ కూడా రాదు.  ధైర్యసాహసాలు, చివరివరకూ పోరాడే తత్వం వల్ల తనను తాను అలా భావించుకుంటానని చెబుతుంది. ఆమె చేతిపై ‘పులి’ టాటూ ఉంటుంది.

ఆ టాటూను చూసినప్పుడల్లా స్ఫూర్తి పొందుతానని అంటుంది. టెన్నిస్‌ కోర్టులో సబలెంకా దూకుడైన ఆటే అందుకు నిదర్శనం. పెద్ద సంఖ్యలో విన్నర్స్‌ ద్వారానే పాయింట్లు రాబట్టడం ఆమె శైలి. ఆరడుగుల ఎత్తు.. పదునైన సర్వీస్‌.. సబలెంకా అదనపు బలాలు. 

అవమానించిన చోటే అదరగొట్టి..
2018 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌... సబలెంకా తొలి రౌండ్‌ మ్యాచ్‌. అప్పటికి ఆమె అనామక క్రీడాకారిణి మాత్రమే. అంతకు ముందు ఏడాది ఇదే టోర్నీలో క్వాలిఫయింగ్‌ దశలోనే వెనుదిరిగింది. ఈసారి కాస్త ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగింది. ప్రపంచ ర్యాంకింగ్‌లో 66వ స్థానంలో ఉంది. అయితే అటు వైపున్న ప్రత్యర్థి ఆస్ట్రేలియాకు చెందిన స్టార్‌ యాష్లీ బార్టీ.  

చాలా మంది పాతతరం ప్లేయర్ల మాదిరే సబలెంకా కూడా కోర్టులో షాట్‌ ఆడేటప్పుడు గట్టిగా అరుస్తుంది. ఏ స్థాయికి చేరినా చిన్నప్పటి నుంచి సాధనతో పాటు వచ్చిన ఈ అలవాటును మార్చుకోవడం అంత సులువు కాదు. ఈ మ్యాచ్‌లోనూ అదే జరిగింది. సబలెంకా దూకుడైన ఆటతోపాటు అరుపులు కూడా జోరుగా వినిపించాయి. ఫలితంగా తొలి సెట్‌ ఆమె సొంతం. దాంతో బార్టీ ఒక్కసారిగా షాక్‌కు గురైంది.

అరుపులు కొంతవరకు ఓకే గానీ మరీ శ్రుతి మించిపోయాయని ఫిర్యాదు చేసింది. అయితే బార్టీని మించి ఆస్ట్రేలియా అభిమానులు చేసిన అతి సబలెంకాను బాగా ఇబ్బంది పెట్టింది. పూర్తిగా నిండిన గ్యాలరీల్లో అంతా బార్టీ అభిమానులే ఉన్నారు. వారంతా సబలెంకాను గేలి చేయడం మొదలుపెట్టారు.

సబలెంకా ప్రతి షాట్‌కూ వారు పెట్టిన అల్లరి వల్ల ఆమె ఏకాగ్రత చెదిరింది. దాంతో తర్వాతి సెట్‌లలో ఓడి మ్యాచ్‌లో పరాజయంపాలైంది. దీనిని సబలెంకా మరచిపోలేదు. అదే వేదికపై తానేంటో నిరూపించుకుంటానని ఈ ‘ఆడ పులి’ ప్రతిజ్ఞ పూనింది. అనుకున్నట్టుగానే తన పట్టుదలను చూపించింది!

అరుపులను ఆపలేదు కానీ ఆటలో మాత్రం అద్భుతంగా దూసుకుపోయింది. ఐదేళ్ల తర్వాత 2023లో అదే రాడ్‌ లేవర్‌ ఎరీనాలో సబలెంకా తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలుచుకుంది. సంవత్సరం తర్వాతా దానిని నిలబెట్టుకొని అదే మెల్‌బోర్న్‌ ఫ్యాన్స్‌ ద్వారా సగర్వంగా జేజేలు అందుకుంది. 

సీనియర్‌గానే సత్తా చాటుతూ..
చాలామంది వర్ధమాన టెన్నిస్‌ స్టార్లతో పోలిస్తే సబలెంకా ప్రస్థానం కాస్త భిన్నం. దాదాపు ప్లేయర్లందరూ జూనియర్‌ స్థాయిలో చిన్న చిన్న టోర్నీలు ఆడుతూ ఒక్కో మెట్టే ఎక్కుతూ ముందుకు వెళతారు. అయితే ఆమె మాత్రం జూనియర్‌ టోర్నీల్లో ఆడే వయసు, అర్హత ఉన్నా వాటికి దూరంగా ఉంది.

గెలిచినా, ఓడినా ప్రొఫెషనల్‌ సర్క్యూట్‌లో సీనియర్‌ స్థాయిలో పోటీ పడటమే మేలు చేస్తుందన్న కోచ్‌ మాటను పాటిస్తూ సర్క్యూట్‌లో పోరాడింది. సబలెంకా తన కెరీర్‌లో ఒక్క జూనియర్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో కూడా పాల్గొనకపోవడం విశేషం. 14 ఏళ్ల వయసులో ప్రొఫెషనల్‌గా ఐటీఎఫ్‌ విమెన్స్‌ వరల్డ్‌ టెన్నిస్‌ టూర్‌ టోర్నీల్లో ఆడటం మొదలుపెట్టింది.

తొలి రెండేళ్లలో ఐదు టోర్నీలూ సొంతగడ్డ బెలారస్‌లోనే ఆడింది. టైటిల్స్‌ దక్కకపోయినా ఆమె ఆట మెరుగుపడుతూ వచ్చింది. 2015 ముగిసే సరికి ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 548వ స్థానంలో ఉన్న సబలెంకా.. 2017లో తన తొలి పెద్ద టోర్నీ (ముంబై ఓపెన్‌) విజయానంతరం 78వ ర్యాంక్‌తో ఆ ఏడాదిని ముగించింది.

ఆ తొలి మూడేళ్లను మినహాయిస్తే ఆ తర్వాత అమిత వేగంతో సబలెంకా కెరీర్‌ దూసుకుపోయింది. అప్పటి వరకు అనామకురాలిగానే ఉన్నా.. 2018 ఆరంభంలో 11వ ర్యాంక్‌కు చేరి.. అప్పటి నుంచి ఇప్పటి వరకు టాప్‌–10లో తన స్థానాన్ని కొనసాగిస్తూ ఉంది. 

డబుల్‌ గ్రాండ్‌స్లామ్‌..
2016 యూఎస్‌ ఓపెన్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో సబలెంకా ఓడింది. తర్వాతి ఆరేళ్లలో నాలుగు గ్రాండ్‌స్లామ్‌లతో కలిపి 22 సార్లు బరిలోకి దిగినా ట్రోఫీకి చేరువగా రాలేకపోయింది. గరిష్ఠంగా మూడుసార్లు సెమీఫైనల్‌తోనే ఆమె సరిపెట్టుకుంది.

అయితే 2023లో సబలెంకా కెరీర్‌ సూపర్‌గా నిలిచింది. అప్పటికి సింగిల్స్‌లో నాలుగు ప్రధాన డబ్ల్యూటీఏ టైటిల్స్‌ విజయాలతో ఫేవరెట్‌లలో ఒకరిగా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ బరిలోకి దిగి.. చివరి వరకు దానిని నిలబెట్టుకుంది. స్థాయికి తగ్గ ప్రదర్శనతో తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలుచుకోవడంతో పాటు సింగిల్స్, డబుల్స్‌లలో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గెలిచిన నాలుగో ప్లేయర్‌గా నిలిచింది.

ఈ గెలుపుతో వరల్డ్‌ నంబర్‌ 2 ర్యాంక్‌ ఆమె దరి చేరింది. ఆపై శిఖరానికి చేరేందుకు సబలెంకాకు ఎక్కువ సమయం పట్టలేదు. మిగిలిన మూడు గ్రాండ్‌స్లామ్‌లలో సెమీస్‌ చేరిన ఆమె యూఎస్‌ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచింది. ఈ ప్రదర్శన కారణంగా ఇదే టోర్నీ ముగిసే సరికి అధికారికంగా సబలెంకా వరల్డ్‌ నంబర్‌వన్‌ స్థానాన్ని అధిరోహించింది.

ఫలితంగా సింగిల్స్, డబుల్స్‌లలో ఏదో ఒక దశలో అగ్రస్థానంలో నిలిచిన అరుదైన క్రీడాకారిణుల జాబితాలో ఆమె చేరింది. కొత్త ఏడాది వచ్చేసరికి ఆమె ఆట మరింత పదునెక్కింది. ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఏడు మ్యాచ్‌లలో ఒక్క సెట్‌ కూడా కోల్పోకుండా విజయఢంకా మోగించింది. రెండో గ్రాండ్‌స్లామ్‌ను తన ఖాతాలో వేసుకొని చిరునవ్వులు చిందించింది. 

దేశం పేరు లేకుండానే..
తన దేశంలో యుద్ధానికి వ్యతిరేకంగా గళమెత్తిన సబలెంకా ఒక క్రీడాకారిణిగా కూడా అదే తరహాలో స్పందించింది. రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధ సమయంలో క్రీడలను రాజకీయాలకు దూరంగా ఉంచాలంటూ బహిరంగ లేఖ రాసింది.

బాధితులైన ఉక్రెయిన్‌ దేశస్థులకు మద్దతునిస్తున్నానంటూ ఆ దేశపు జాతీయ పతాకంలోని రంగుల బ్యాండ్‌లను మైదానంలో ధరించింది. తన దేశం అనవసరంగా యుద్ధపిపాసి జాబితాలో చేరడంపై బాధను వ్యక్తం చేసింది. అయితే దురదృష్టం ఏమిటంటే ఆమె బెలారస్‌ ప్లేయర్‌ కావడమే. యుద్ధ నేపథ్యంలో రష్యా, బెలారస్‌ దేశపు ప్లేయర్లపై వేర్వేరు అంతర్జాతీయ క్రీడా సమాఖ్యలు నిషేధం విధించాయి.

ఈ జాబితాలో విమెన్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ (డబ్ల్యూటీఏ) కూడా ఉంది. తర్వాత.. యుద్ధంతో ప్లేయర్లకు సంబంధం లేదని భావించి వారికి ఆడే అవకాశాన్నిచ్చాయి. కానీ తమ దేశం పేరును వాడకుండా.. ఏ దేశానికీ ప్రాతినిధ్యం వహించకుండా.. తటస్థులుగా బరిలోకి దిగాలనే నియమంతో! దాంతో చాంపియన్‌గా నిలిచిన తన దేశం పేరును, జెండాను సగర్వంగా ప్రదర్శించుకునే పరిస్థితి సబలెంకాకు లేకపోయింది.

ఇటీవలి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లోనూ అదే కొనసాగడంతో.. ఇప్పటికీ డబ్ల్యూటీఏ వెబ్‌సైట్‌లో ఆమె పేరు పక్కన దేశం పేరు లేదు. 26 ఏళ్ల సబలెంకా తాజా ఫామ్‌ను బట్టి ఈ ప్రతికూలతలన్నింటినీ దాటుకుని మున్ముందు మరిన్ని ఘన విజయాలు అందుకోవడం ఖాయమని తెలుస్తోంది. 
 -మొహమ్మద్‌ అబ్దుల్‌ హాది 

whatsapp channel

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top