
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (PC: BCCI)
ఆసియా కప్-2025 టోర్నమెంట్లో టీమిండియా- పాకిస్తాన్ (Ind vs Pak) మ్యాచ్ నిర్వహణపై సందిగ్దం పూర్తిగా తొలగిపోయింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పాక్‌తో క్రికెట్ మ్యాచ్‌కు రాజముద్ర వేసిన విషయం తెలిసిందే. తాజాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించింది.
కాగా ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహించే ఆసియా కప్ టోర్నీ ఆతిథ్య హక్కులు భారత్ దక్కించుకుంది. కానీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో ఉన్న ఒప్పందం దృష్ట్యా తటస్థ వేదికపై మ్యాచ్‌లు నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వేదికగా ఈ టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది.
రెండు గ్రూపులు.. ఎనిమిది జట్లు
ఇక సెప్టెంబరు 9- 28 మధ్య నిర్వహించే ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్.. గ్రూప్-‘బి’ నుంచి శ్రీలంక, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, హాంకాంగ్ టైటిల్ కోసం పోటీపడనున్నాయి.
ఇదిలా ఉంటే.. ఒకే గ్రూపులో ఉన్న భారత్- పాక్ లీగ్ దశలో ఒకసారి కచ్చితంగా ముఖాముఖి తలపడాల్సి ఉంది. సెప్టెంబరు 14న చిరకాల ప్రత్యర్థుల పోరుకు షెడ్యూల్ ఖరారైంది. ఆ తర్వాత సూపర్ ఫోర్ దశలో.. అన్నీ సజావుగా సాగితే ఫైనల్లోనూ ఈ రెండు జట్లు పోటీ పడే అవకాశం ఉంది.
అనుమతినిచ్చిన కేంద్ర ప్రభుత్వం
అయితే, పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌తో క్రీడల్లోనూ అన్ని సంబంధాలు తెంచుకోవాలనే డిమాండ్లు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఆసియా కప్ టోర్నీలోనూ దాయాదుల పోరు ఉండబోదనే వార్తలు వచ్చాయి. అయితే, ఇదొక మల్టీలేటరల్ ఈవెంట్ (ఇతర దేశాలు కూడా పాల్గొంటున్న టోర్నీ) కావడంతో కేంద్ర ప్రభుత్వం ఇందుకు అంగీకరించింది.
బీసీసీఐ స్పందన ఇదే
అయితే, ఈ విషయంపై బీసీసీఐ మాత్రం ఇంత వరకు నోరు విప్పలేదు. తాజాగా.. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించాడు. ‘‘కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించాలనేది బీసీసీఐ విధానం. ఇప్పుడు కూడా అంతే. మల్టీ నేషనల్ టోర్నమెంట్ లేదంటే అంతర్జాతీయ స్థాయి టోర్నీలో ఆడాలన్నా కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పక తీసుకుంటాం.
భారత్‌తో సంబంధాలు బాగాలేని దేశాల జట్లతో ఆడాలా? లేదా? అన్న విషయాన్ని కూడా కేంద్రమే నిర్ణయిస్తుంది. ఆసియా కప్ టోర్నీలో కూడా వివిధ దేశాలు పాల్గొంటున్నందున మాకు అనుమతి లభించింది. ఆసియా క్రికెట్ నియంత్రణ మండలి లేదంటే అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి నిర్వహించే టోర్నీల్లో టీమిండియా ఆడకుండా ఉండదు కదా!
ఫిఫా, ఏఎఫ్‌సీ.. ఇలా ఈ క్రీడలోనైనా.. మేము ప్రత్యేకంగా ఓ దేశంతో మ్యాచ్ ఆడబోమని చెబితే.. ఇండియన్ ఫెడరేషన్ మీద ఆంక్షలు విధించే అవకాశం ఉండవచ్చు’’ అని దేవజిత్ సైకియా పేర్కొన్నాడు. ద్వైపాక్షిక సిరీస్‌లలో మాత్రం టీమిండియా పాక్‌తో ఆడబోదని స్పష్టం చేశాడు.
చదవండి: చిన్ననాటి గురువుకు రూ. 80 లక్షల సాయం.. హార్దిక్, కృనాల్ మంచి మనసు