రూడ్, జబర్‌లకు షాక్‌!

Australian Open 2023: Casper Ruud, Alexander Zverev bow out after defeats - Sakshi

రెండో రౌండ్‌లోనే ఓడిన రెండో సీడ్‌లు

మూడో రౌండ్లోకి జొకోవిచ్‌

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌

మెల్‌బోర్న్‌: ఈ సీజన్‌ ఆరంభ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో సంచలనాల పరంపర కొనసాగుతోంది. సీడెడ్‌ స్టార్లు రెండో రౌండే దాటలేకపోతున్నారు. నాలుగో రోజు పోటీల్లో రెండో సీడ్‌ కాస్పర్‌ రూడ్‌ (నార్వే), 12వ సీడ్, ఒలింపిక్‌ చాంపియన్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) ఇంటిదారి పట్టారు. నాదల్‌ ఇది వరకే అవుటైన ఈ టోర్నీలో హాట్‌ ఫేవరెట్‌గా మారిన సెర్బియన్‌ దిగ్గజం నొవాక్‌ జొకోవిచ్‌ మూడో రౌండ్లోకి ప్రవేశించాడు. మహిళల సింగిల్స్‌లో నిరుటి వింబుల్డన్, యూఎస్‌ ఓపెన్‌ రన్నరప్, రెండో సీడ్‌ అన్స్‌ జబర్‌ (ట్యూనిషియా), తొమ్మిదో సీడ్‌ వెరొనికా కుడెర్మెతొవ (రష్యా), 16వ సీడ్‌ అనెట్‌ కొంటావిట్‌ (ఈస్టోనియా)లు కంగు తిన్నారు. ఈ విభాగంలో నాలుగో సీడ్‌ కరొలిన్‌ గార్సియా (ఫ్రాన్స్‌), ఐదో సీడ్‌ అరిన సబలెంక (బెలారస్‌), 12వ సీడ్‌ బెలిండా బెన్సిక్‌ (స్విట్జర్లాండ్‌) ముందంజ వేశారు.

బ్రూక్స్‌బి ‘హీరో’చితం
పురుషుల సింగిల్స్‌లో గురువారం జరిగిన రెండో రౌండ్లో  22 ఏళ్ల యువ అమెరికన్‌ జెన్సన్‌ బ్రూక్స్‌బి సంచలన ప్రదర్శనతో రూడ్‌ను కంగుతినిపించాడు. దీంతో గతేడాది  ఫ్రెంచ్, యూఎస్‌ ఓపెన్‌లలో రన్నరప్‌గా నిలిచిన రూడ్‌ ఈ సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌లో అనూహ్యంగా రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. 3 గంటల 55 నిమిషాల సమరంలో బ్రూక్స్‌బి 6–3, 7–5, 6–7 (4/7), 6–2తో రూడ్‌ను ఓడించాడు. 8వ సీడ్‌ టేలర్‌ ఫ్రిట్జ్‌ (అమెరికా) అయితే వైల్డ్‌కార్డ్‌ ప్లేయర్‌ అలెక్సీ పాపిరిన్‌ (ఆస్ట్రేలియా) చేతిలో చేతులెత్తేశాడు. ఫ్రిట్జ్‌ 7–6 (7/4), 6–7 (2/7), 4–6, 7–6 (8/6), 2–6తో 23 ఏళ్ల అలెక్సీ పోరాటానికి తలవంచాడు. నాలుగో సీడ్‌ జొకోవిచ్‌ (సెర్బియా) 6–1, 6–7 (5/7), 6–2, 6–0తో క్వాలిఫయర్‌ ఎంజో కౌకాడ్‌ (మారిషస్‌)పై గెలుపొందగా, జ్వెరెవ్‌కు 7–6 (7/1), 4–6, 3–6, 2–6తో మైకేల్‌ మో (అమెరికా) చేతిలో చుక్కెదురైంది. ఐదో సీడ్‌ రుబ్లెవ్‌ (రష్యా) 6–2, 6–4, 6–7 (2/7), 6–3తో ఎమిల్‌ రుసువురి (ఫిన్లాండ్‌)పై నెగ్గాడు.  

మూడో రౌండ్లో గార్సియా, సబలెంక
మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్లో నాలుగో సీడ్‌ గార్సియా (ఫ్రాన్స్‌) 7–6 (7/5), 7–5తో లేలా ఫెర్నాండెజ్‌ (కెనడా)పై, ఐదో సీడ్‌ సబలెంక (బెలారస్‌) 6–3, 6–1తో షెల్బీ రోజర్స్‌ (అమెరికా)పై వరుస సెట్లలో విజయం సాధించారు. అయితే గతేడాది సూపర్‌ ఫామ్‌లో ఉన్న రెండో సీడ్‌ జబర్‌ (ట్యూనిషియా) 1–6, 7–5, 1–6తో మర్కెట వొండ్రొసొవా (చెక్‌ రిపబ్లిక్‌) చేతిలో పరాజయం పాలైంది. 9వ సీడ్‌ కుడెర్మెతొవ (రష్యా) 4–6, 6–2, 2–6తో అమెరికాకు చెందిన క్వాలిఫయర్‌ కేటీ వొలినెట్స్‌ చేతిలో ఇంటిదారి పట్టింది. 12వ సీడ్‌ బెన్సిచ్‌ 7–6 (7/3), 6–3తో క్లెయిర్‌ లియూ (అమెరికా)పై గెలుపొందగా, 16వ సీడ్‌ కొంటావిట్‌ (ఈస్టోనియా) 6–3, 3–6, 4–6తో మగ్ద లినెట్‌ (పోలాండ్‌) చేతిలో కంగుతింది. 30వ సీడ్‌ కరోలినా ప్లిస్కొవా (చెక్‌ రిపబ్లిక్‌) 6–0, 7–5తో పుతినెత్సవ (రష్యా)పై గెలిచింది.

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top