బాల్‌ ట్యాంపరింగ్‌ చేస్తున్నానని వారికీ తెలుసు: ఆసీస్‌ క్రికెటర్‌ బాన్‌క్రాఫ్ట్‌

Australian bowlers were aware of ball-tampering tactics - Sakshi

లండన్‌: క్రికెట్‌లో పెను దుమారానికి కారణమైన 2018 బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంపై ఆ ఘటన ప్రధాన సూత్రధారి ఆస్ట్రేలియా క్రికెటర్‌ కామెరూన్‌ బాన్‌క్రాఫ్ట్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘నేను ఉద్దేశపూర్వకంగా బంతి ఆకారాన్ని మార్చేందుకు (బాల్‌ ట్యాంపరింగ్‌) ప్రయత్నిస్తున్నాననే విషయం అప్పటి సారథి స్మిత్, వార్నర్‌లతోపాటు ఇతర బౌలర్లకు కూడా తెలుసు. ఎందుకంటే నేను చేసే పని వల్ల వారికే లాభం ఎక్కువగా ఉంటుంది. జట్టులో గుర్తింపు తెచ్చుకోవడం కోసం నేను ట్యాంపరింగ్‌కు పూనుకున్నాను.

ఆ సమయంలో నైతిక విలువలను నేను పూర్తిగా మరిచిపోయాను. ఆ తర్వాతే నాకు తెలిసింది నేను ఎంత పెద్ద తప్పు చేశానో’ అని ఇంగ్లండ్‌కు చెందిన ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాన్‌క్రాఫ్ట్‌ పేర్కొన్నాడు. 2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో భాగంగా మూడో మ్యాచ్‌లో బాన్‌క్రాఫ్ట్‌ బంతికి స్యాండ్‌ పేపర్‌ను రుద్దుతూ కెమెరాలకు చిక్కాడు. దాంతో ఆగ్రహించిన క్రికెట్‌ ఆస్ట్రేలియా... బాన్‌క్రాఫ్ట్‌పై 9 నెలలు... స్మిత్, వార్నర్‌లపై ఏడాది పాటు నిషేధం విధించింది. బాన్‌క్రాఫ్ట్‌ ప్రస్తుతం ఇంగ్లండ్‌ కౌంటీ చాంపియన్‌ షిప్‌లో డర్హామ్‌ జట్టుకు ఆడుతున్నాడు.  

విచారణకు సిద్ధమైన సీఏ
బాల్‌ ట్యాంపరింగ్‌పై బాన్‌క్రాఫ్ట్‌ చేసిన తాజా వ్యాఖ్యలపై క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) విచారణకు సిద్ధమైంది. బాన్‌క్రాఫ్ట్‌ చెప్పినట్లు ఇతర బౌలర్లకు కూడా ఈ విషయం ముందుగానే తెలుసా అనే కోణంలో విచారణ ఉంటుందని సీఏ పేర్కొంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top