భారత్‌, ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌ కాదు.. టీ20 ప్రపంచకప్‌ విజేత ఆ జట్టే: భారత మాజీ ఆటగాడు

Australia are favorites to win the upcoming T20 World Cup 2022 says karim - Sakshi

టీ20 ప్రపంచకప్‌-2022 ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొనే జట్లు అన్నీ తమ సన్నాహాకాలను కూడా ప్రారంభించాయి. ఇక ఈ టోర్నీకి దాదాపు నెల రోజుల సమయం ఉన్నప్పటకీ.. క్రికెట్‌ నిపుణులు, మాజీలు మాత్రం టోర్నీ విజేతలను ముందుగానే అంచనా వేస్తున్నారు.

తాజాగా ఈ జాబితాలోకి భారత మాజీ ఆటగాడు సబా కరీం చేరాడు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ను గెలిచే సత్తా అతిథ్య ఆస్ట్రేలియాకు ఉంది అని అతడు జోస్యం చెప్పాడు. కాగా టీ20 ప్రపంచకప్‌-2022లో ఆస్ట్రేలియా డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగనుంది. గతేడాది దుబాయ్‌ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి తొలి సారి టీ20 ప్రపంచకప్‌ టైటిల్‌ను ఆసీస్‌ ముద్దాడింది. ఇక ఇది ఇలా ఉండగా.. బ్యాటింగ్‌ పరంగా ప్రస్తుతం ఆస్ట్రేలియా పటిష్టంగా కన్పిస్తోంది అని కరీమ్ అభిప్రాయపడ్డాడు.

ఈ క్రమంలో స్పోర్ట్స్‌18తో కరీం మాట్లాడూతూ.. "ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా మళ్లీ సొంతం చేసుకుంటుందని భావిస్తున్నాను. ఆస్ట్రేలియా ప్రస్తుతం టీ20 క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తోంది. ముఖ్యం వారు తమ సొంత గడ్డపై ఆడనున్నారు. అది వారికి బాగా కలిసి వస్తుంది. అదే విధంగా ఆసీస్‌ ప్రస్తుతం కొత్త లూక్‌లో కన్పిస్తోంది.

ఇటువంటి మెగా టోర్నమెంట్‌లలో విజయం సాధించడానికి తగ్గట్టుగా తమ జట్టును ఆసీస్‌ తాయారు చేసుకుంది. ఇక ఆస్ట్రేలియాలో గ్రౌండ్‌లు పెద్దగా ఉంటాయి. కాబట్టి ప్రతీ జట్టుకు పవర్‌ హిట్టర్‌లు అవసరం. ఆసీస్‌ జట్టులో టిమ్‌ డేవిడ్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌ వంటి హిట్టర్లు ఉన్నారు. కాగా ప్రస్తుతం మిచెల్‌ మార్ష్‌, స్టోయినిస్‌ జట్టుకు దూరంగా ఉన్నారు. వారిద్దరూ తిరిగి మళ్లీ జట్టులోకి వస్తే ఆసీస్‌కు ప్రపంచకప్‌లో ఇక తిరుగుండదు" అని పేర్కొన్నాడు. 

కాగా ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం మూడు టీ20ల సిరీస్‌ నిమిత్తం భారత్‌లో పర్యటిస్తోంది. మొహాలీ వేదికగా జరిగిన తొలి టీ20లో విజయం సాధించిన ఆసీస్‌.. ఈ సిరీస్‌లో 1-0తేడాతో ముందుంజలో ఉంది. ఇక నాగ్‌పూర్‌ వేదికగా ఇరు జట్లు మధ్య రెండో టీ20 శుక్రవారం జరగనుంది.
చదవండి: T20 WC 2022: పంత్‌కు కచ్చితంగా తుది జట్టులో చోటు ఇవ్వాల్సిందే: ఆసీస్‌ దిగ్గజం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top