ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ ట్రవిస్ హెడ్ (Travis Head) అరుదైన ఘనత సాధించాడు. యాషెస్ ఇన్నింగ్స్‌లో అతి తక్కువ బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్న బ్యాటర్ల జాబితాలో స్థానం సంపాదించాడు.
పెర్త్ స్టేడియంలో ఇంగ్లండ్‌తో తొలి టెస్టు రెండో రోజు ఆట సందర్భంగా హెడ్ ఈ ఫీట్ నమోదు చేశాడు. కాగా ఆస్ట్రేలియా- ఇంగ్లండ్ మధ్య యాషెస్ సిరీస్ 2025-26కు శుక్రవారం తెరలేచింది. పెర్త్ స్టేడియంలో మొదలైన తొలి టెస్టులో టాస్ ఓడిన ఆతిథ్య ఆసీస్ తొలుత బౌలింగ్ చేయాల్సి వచ్చింది.
హోరాహోరీ
ఈ క్రమంలో ఆకాశమే హద్దుగా చెలరేగి కంగారూ జట్టు పేసర్ మిచెల్ స్టార్క్ ఏడు వికెట్లు తీసి.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగులకే ఆలౌట్ కావడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, ఇందుకు ఇంగ్లండ్ బౌలర్లు కూడా ధీటుగానే బదులిచ్చి ఆసీస్‌ను 132 పరుగులకే కుప్పకూల్చారు.
ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో నలభై పరుగుల ఆధిక్యం సాధించిన ఇంగ్లండ్.. రెండో ఇన్నింగ్స్‌లో 164 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఆసీస్ విజయ లక్ష్యం 205 పరుగులుగా మారగా.. ఆస్ట్రేలియా నిలకడగా ఆడుతూ గెలుపు దిశగా పయనిస్తోంది.
మ్యాచ్ స్వరూపమే మార్చివేసిన హెడ్
లక్ష్య ఛేదనలో ఓపెనర్‌గా వచ్చిన ట్రవిస్ హెడ్ ఆది నుంచే ఇంగ్లండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఇంగ్లిష్ జట్టు శైలిలో ‘బజ్ బాల్’ ఆటతొ చెలరేగిన హెడ్.. 36 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.
తద్వారా యాషెస్ సిరీస్‌లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ నమోదు చేసిన ఐదో బ్యాటర్‌గా నిలిచాడు. అంతకు ముందు జాన్ బ్రౌన్ (33 బంతుల్లో), గ్రాహమ్ యాలోప్ (35), డేవిడ్ వార్నర్ (35), కెవిన్ పీటర్సన్ (36) ఈ ఘనత సాధించారు.
చరిత్ర సృష్టించిన హెడ్.. యాషెస్ మొనగాడు
ఆ తర్వాత కూడా అదే జోరును కొనసాగించిన హెడ్.. 69 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్నాడు. తద్వారా మరో సరికొత్త చరిత్రకు నాంది పలికాడు. యాషెస్ సిరీస్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచిన హెడ్.. ఛేదనలో భాగంగా నాలుగో ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.
పెర్త్ టెస్టు తుదిజట్లు
ఆస్ట్రేలియా
ఉస్మాన్ ఖవాజా, జేక్ వెదర్‌రాల్డ్, మార్నస్ లబుషేన్, స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), ట్రవిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్),
మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, బ్రెండన్ డాగెట్, స్కాట్ బోలాండ్
ఇంగ్లండ్
బెన్ డకెట్, జాక్ క్రాలీ, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్.
చదవండి: ఇంకా ఏం రాస్తున్నాడు?.. వైభవ్ ఏం తప్పు చేశాడు?: కోచ్‌పై మాజీ క్రికెటర్ ఫైర్


