
ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్ రూపంలో మినీ క్రికెట్ సంగ్రామం అభిమానులకు కావాల్సినంత మజా పంచనుంది. ఈసారి పొట్టి ఫార్మాట్లో నిర్వహించే ఈ ఖండాంతర టోర్నీకి సెప్టెంబరు 9న తెరలేవనుంది. ఆతిథ్య హక్కులు భారత్‌వే అయినా.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో గత ఒప్పందం దృష్ట్యా తటస్థ వేదికైన యూఏఈలో ఆసియా కప్ ఈవెంట్ జరుగనుంది.
పాకిస్తాన్‌ను చిత్తు చేసి
గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్.. గ్రూప్-‘బి’ నుంచి శ్రీలంక, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, హాంకాంగ్ ఈ టోర్నీలో తలపడనున్నాయి. కాగా చివరగా 2022లో టీ20 ఫార్మాట్లో ఆసియా కప్ జరుగగా.. నాటి ఫైనల్లో శ్రీలంక పాకిస్తాన్‌ను చిత్తు చేసి టైటిల్ గెలిచింది. ఆనాడు రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా సూపర్ ఫోర్ దశలో ఊహించని రీతిలో పాకిస్తాన్, శ్రీలంక చేతిలో ఓడి ఇంటిబాట పట్టింది.
ప్రపంచకప్ టోర్నీలో సత్తా చాటిన భారత్
అయితే, ఆ చేదు జ్ఞాపకాన్ని చెరిపివేసేలా రోహిత్ సేన.. టీ20 ప్రపంచకప్-2024 (T20 World Cup) ట్రోఫీని సొంతం చేసుకుంది. టోర్నీ ఆసాంతం అజేయంగా నిలిచి టైటిల్‌ను గెలుచుకుంది. ఈ టోర్నీలో పాక్ కనీసం సెమీస్ కూడా చేరకుండానే నిష్క్రమించింది. అంతేకాదు.. అమెరికా వంటి పసికూన చేతిలో ఓడి ఓటమిపాలైంది.
చాంపియన్స్ ట్రోఫీ కూడా టీమిండియాదే
ఇదిలా ఉంటే.. గత ఆసియా కప్-2023 టోర్నీ వన్డే ఫార్మాట్లో జరుగగా రోహిత్ సేన విజేతగా నిలిచింది. అనంతరం సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్-2023లో అద్భుత ప్రదర్శన కనబరిచిన టీమిండియా.. ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలై రన్నరప్‌తో సరిపెట్టుకుంది. అయితే, యాభై ఫార్మాట్లోనే జరిగే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో రోహిత్ సేన టైటిల్ గెలిచి సత్తా చాటింది.
పాకిస్తాన్ ఈ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వగా తటస్థ వేదికైన దుబాయ్‌లో టీమిండియా తమ మ్యాచ్‌లు ఆడింది. ఈ టోర్నీలో పాక్ జట్టు గెలుపున్నదే లేకుండా నిష్క్రమించగా.. శ్రీలంక అసలు ఈ ఈవెంట్‌కు అర్హతే సాధించలేదు. మరోవైపు.. బంగ్లాదేశ్ కూడా వరుస ఓటములతో ఇంటిబాట పట్టింది.
అఫ్గనిస్తాన్ అద్భుత ప్రదర్శనలు
అయితే, టీ20 ప్రపంచకప్-2024లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి పటిష్ట జట్లను ఓడించడంతో పాటు.. సెమీస్ చేరి అఫ్గనిస్తాన్ సంచలనం సృష్టించింది. అంతేకాదు.. వన్డే వరల్డ్‌కప్-2023 సందర్భంగా తొలిసారి పాకిస్తాన్‌ను ఓడించి సెమీ ఫైనల్ దగ్గరగా వచ్చింది.
కానీ.. ఆఖరి నిమిషంలో ఒత్తిడిలో చిత్తై లీగ్ దశలోనే నిష్క్రమించినా.. తొలిసారి ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి మాత్రం అర్హత సాధించింది అఫ్గన్ జట్టు. ఈ మెగా టోర్నీలో ఇంగ్లండ్‌ను ఓడించి సత్తా చాటింది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ మదన్ లాల్ ఆసియా కప్ విజేత ఎవరన్న అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
విజేత టీమిండియానే.. కానీ ఆ జట్టుతో జాగ్రత్త
‘‘టీమిండియా అద్భుత నైపుణ్యాలు గల జట్టు. కచ్చితంగా హాట్ ఫేవరెట్ టీమిండియానే. అయితే, టీ20 ఫార్మాట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ ప్రదర్శనలను ఓసారి పరిశీలించాలి.
ముఖ్యంగా అఫ్గనిస్తాన్. గత కొన్నాళ్లుగా ఈ ఫార్మాట్లో వాళ్లు అద్భుత విజయాలు అందుకుంటున్నారు. కచ్చితంగా పాకిస్తాన్‌కు అఫ్గనిస్తాన్ గట్టి పోటీ ఇస్తుంది. అఫ్గన్ల ఆత్మవిశ్వాసం, ఫామ్ అసాధారణంగా ఉన్నాయి.
కాబట్టి శ్రీలంక, బంగ్లాదేశ్‌లతో పాటు అఫ్గనిస్తాన్‌ను కూడా ఈ టోర్నీలో స్ట్రాంగ్ కంటెండర్‌గా పేర్కొనవచ్చు’’ అని వార్తా సంస్థ ANIతో మదన్ లాల్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా సెప్టెంబరు 9న అఫ్గనిస్తాన్- హాంకాంగ్ మ్యాచ్‌తో మొదలయ్యే ఆసియా కప్-2025 టోర్నీ సెప్టెంబరు 28న ఫైనల్‌తో ముగుస్తుంది.
చదవండి: ఇంకెంత రెస్ట్ కావాలి: రోహిత్‌పై గంభీర్ ఫైర్.. నాడు..