టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ కుమారుడు అన్వయ్ ద్రవిడ్ దేశవాళీ క్రికెట్‌లో అదరగొడుతున్నాడు. వినూ మన్కడ్ ట్రోఫీ అండర్-19 వన్డే టోర్నీలో కర్ణాటక తరఫున ఆడుతున్న 17 ఏళ్ల అన్వయ్.. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 41 బంతుల్లోనే 85 పరుగులు చేసి, తన జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.
ఏడు సిక్సర్లతో విరుచుకుపడ్డ అన్వయ్
నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అన్వయ్.. తన ఇన్నింగ్స్‌లో ఏడు సిక్సర్లు, ఐదు ఫోర్లు బాదాడు. అతడి ధాటికి కర్ణాటక నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 418 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం ఢిల్లీని 220 పరుగులకే కట్టడి చేసి, 198 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
సెహ్వాగ్ కుమారుడితో పోటీ
ఈ మ్యాచ్‌లో మరో ఆసక్తికర అంశం కూడా ఉంది. భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ ఢిల్లీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన అతడు 35 బంతుల్లో 32 పరుగులు చేశాడు. ఒకప్పుడు భారత క్రికెట్‌లో తమదైన ముద్ర వేసిన ఇద్దరు దిగ్గజాల కుమారులు ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థులుగా తలపడటం విశేషం.
భారత అండర్-19 జట్టులో చోటు
అన్వయ్, ఆర్యవీర్ ఇటీవల భారత అండర్-19 జట్టులో చోటు దక్కించుకున్నారు. నవంబర్‌లో జరగనున్న అండర్-19 ఆసియా కప్‌లోనూ వీరిద్దరూ ఆడే అవకాశం ఉంది.
గత మ్యాచ్‌లోనూ శతకం
అన్వయ్ ప్రస్తుతం వినూ మన్కడ్ ట్రోఫీలో అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. అంతకుముందు చండీగఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 62 బంతుల్లోనే 104 పరుగులు సాధించాడు. భారత అండర్-19 జట్టు తరఫున శ్రీలంక యువ జట్టుతో జఔరిగిన వన్డే మ్యాచ్‌లోనూ 67 బంతుల్లో 87 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.
తండ్రి శైలికి భిన్నంగా..!
రాహుల్ ద్రవిడ్ టెస్టు క్రికెట్‌లో అద్భుతమైన డిఫెన్స్‌తో ‘ది వాల్’గా పేరు తెచ్చుకున్నాడు. తన సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్‌లో 23 వేలకుపైగా పరుగులు సాధించాడు. భారత క్రికెట్ చరిత్రలో అత్యధిక అంతర్జాతీయ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి తర్వాతి స్థానంలో ఉన్నాడు.
అయితే, తండ్రికి భిన్నంగా అన్వయ్ దూకుడైన బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. వరుసగా భారీ ఇన్నింగ్స్‌లు ఆడుతూ ప్రతిభను చాటుతున్నాడు. అన్వయ్ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే, త్వరలో టీమిండియా తలుపు తట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఇదీ చదవండి: హ్యాట్రిక్‌తో విజృంభించిన రాజస్థాన్ రాయల్స్ బౌలర్


