తొలి రౌండ్లో అమిత్‌కు ‘బై’

Amit Panghal, three other Indian boxers receive byes - Sakshi

మరో ముగ్గురు బాక్సర్లకూ... ఓవరాల్‌గా క్లిష్టమైన డ్రా

టోక్యో: ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌ బాక్సర్‌ అమిత్‌ పంఘాల్‌ (52 కేజీలు) సహా నలుగురు బాక్సర్లకు ఒలింపిక్స్‌ తొలి రౌండ్లో ‘బై’ లభించింది. గురువారం తీసిన ‘డ్రా’లో పురుషుల విభాగంలో సతీశ్‌ కుమార్‌ (ప్లస్‌ 91 కేజీలు), మహిళల విభాగంలో లవ్లీనా (69 కేజీలు), సిమ్రన్‌జిత్‌ కౌర్‌ (60 కేజీలు)లకు తొలి రౌండ్లో బై లభించగా... వీరంతా నేరుగా ప్రిక్వార్టర్‌ ఫైనల్లో తలపడతారు. అయితే మొత్తమ్మీద భారత బాక్సర్లందరికీ క్లిష్టమైన ‘డ్రా’నే ఎదురైంది.

తదుపరి రౌండ్లలో గత ఒలింపిక్స్‌ పతక విజేతలు, మేటి ప్రత్యర్థులు ఎదురుకానుండటంతో బాక్సర్లకు కష్టాలు తప్పేలా లేవు. 25న జరిగే తొలి రౌండ్‌ బౌట్‌లో హెర్నాండెజ్‌ (డొమినికా)తో ఆరుసార్లు ప్రపంచ చాంపియన్, స్టార్‌ మహిళా బాక్సర్‌ మేరీకోమ్‌ (51 కేజీలు)... ఇచ్రక్‌ చైబ్‌ (అల్జీరియా)తో పూజా రాణి (75 కేజీలు) పోటీపడతారు. ప్రిక్వార్టర్స్‌లో లవ్లీనా... నడిన్‌ అప్టెజ్‌ (జర్మనీ)తో, సిమ్రన్‌జీత్‌... సుదపొర్న్‌ సీసొండి (థాయ్‌లాండ్‌)తో తలపడతారు. పురుషుల ఈవెంట్‌ తొలి రౌండ్లో లూక్‌ మెక్‌కార్మక్‌ (బ్రిటన్‌)తో మనీశ్‌ కౌశిక్‌ (63 కేజీలు)... మెన్సా ఒకాజావ (జపాన్‌)తో వికాస్‌ కృషన్‌ (69 కేజీలు)... ఎర్బెకి తౌహెటా (చైనా)తో ఆశిష్‌ (75 కేజీలు) తలపడతారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top