6 రోజులు కాదు...36 గంటలే!

36 Hours Quarantine For Australia And England Players - Sakshi

క్వారంటీన్‌పై ఆసీస్, ఇంగ్లండ్‌ క్రికెటర్లకు ఊరట

దుబాయ్‌: ఐపీఎల్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ క్రికెటర్లను తొలి మ్యాచ్‌నుంచి ఆడించాలనుకున్న ఫ్రాంచైజీలను సంతోషపెట్టే వార్త ఇది. యూఏఈకి వచ్చిన తర్వాత నిబంధనల ప్రకారం ప్రతీ ఒక్కరు కనీసం ఆరు రోజులు క్వారంటీన్‌లో ఉండాల్సిందే. ఇదే జరిగితే అన్ని జట్లు ఆరంభ మ్యాచ్‌లలో ఆయా క్రికెటర్ల సేవలు కోల్పోయేవి. అయితే టి20, వన్డే సిరీస్‌ కోసం తాము ఇప్పటికే బయో బబుల్‌లో ఉన్నాం కాబట్టి క్వారంటీన్‌ సమయాన్ని కనీసం మూడు రోజులకు తగ్గించాలంటూ ఆసీస్, ఇంగ్లండ్‌ క్రికెటర్లు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. అయితే ఇప్పుడు వారంతా 36 గంటలు సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉంటే చాలని నిర్వాహకులు స్పష్టం చేశారు.

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ స్థానిక అధికారులతో మాట్లాడిన తర్వాత ఈ నిర్ణయం వెలువడింది. ‘క్రికెటర్ల ఐసోలేషన్‌ సమయానికి సంబంధించిన సమస్య పరిష్కృతమైంది. వారంతా 6 రోజులు కాకుండా 36 గంటలు విడిగా తమ హోటల్‌ గదుల్లో గడిపితే చాలు. ప్రతీ జట్టు తొలి మ్యాచ్‌లోనే తమ స్టార్‌ ఆటగాళ్లతో బరిలోకి దిగేందుకు ఇది మంచి అవకాశం’ అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. యూఏఈలోకి అడుగు పెట్టిన తర్వాత మాత్రం ప్రొటోకాల్‌ ప్రకారం వారికి వరుసగా కోవిడ్‌–19 పరీక్షలు నిర్వహిస్తారు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లనుంచి కలిపి 21 మంది క్రికెటర్లు ఐపీఎల్‌లో పాల్గొంటున్నారు. అయితే వీరిలో కమిన్స్, మోర్గాన్, బాంటన్‌ (ముగ్గురూ కోల్‌కతా) మాత్రం ఆరు రోజుల క్వారంటీన్‌లో ఉండాల్సి ఉంది. ఈ ఆటగాళ్లంతా ప్రత్యేక విమానంలో గురువారం దుబాయ్‌ చేరుకున్నారు.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top