ఇదేం తీరు? | - | Sakshi
Sakshi News home page

ఇదేం తీరు?

Aug 30 2026 7:18 AM | Updated on Aug 30 2026 7:18 AM

నిర్వాసితుల పట్ల రోజుకో తప్పిదం

ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీవాసుల ఆందోళన

గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీ దుస్థితి

మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ నిర్మాణం కోసం సర్వం ధారపోసిన నిర్వాసితుల పట్ల

రోజుకో తప్పిదం జరుగుతోంది. తాజాగా స్మార్ట్‌ రేషన్‌ కార్డుల్లో నిర్వాసితుల గ్రామాల పేర్లను మాయం చేశారు. కార్డుల్లో ముట్రాజ్‌పల్లి, సంగాపూర్‌ గ్రామాల పేరిట అందజేస్తున్నారు. ఈ పరిణామం పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి అవరోధమని కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. – గజ్వేల్‌

స్మార్ట్‌ రేషన్‌ కార్డుల్లో నిర్వాసిత గ్రామాల పేర్లు మాయం

జ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని ముట్రాజ్‌పల్లి, సంగాపూర్‌ గ్రామాల పరిధిలో మల్లన్నసాగర్‌ నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీని నిర్మించిన సంగతి తెలిసిందే. ముంపు గ్రామాలైన ఏటిగడ్డకిష్టాపూర్‌లో 1,253, లక్ష్మాపూర్‌లో 388, వేములగాట్‌లో 1252, పల్లెపహాడ్‌లో 921, రాంపూర్‌లో 320, బ్రహ్మణ బంజేరుపల్లిలో 267, ఎర్రవల్లిలో 800, సింగారంలో మరో 330కుపైగా కుటుంబాలున్నాయి. ఆయా గ్రామాల్లో 14వేల పైచిలుకు ఓట్లు ఉన్నాయి. కాలనీకి వచ్చినప్పటి నుంచి వీరిని నిత్యం సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా స్మార్ట్‌ రేషన్‌ కార్డుల్లో తమ గ్రామాల పేర్లు మాయం కావడం కాలనీవాసులను ఆందోళనకు గురిచేస్తున్నది.

ముట్రాజ్‌పల్లి, సంగాపూర్‌ పేరిట

స్మార్ట్‌ రేషన్‌ కార్డులు

ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీవాసులు అధికారికంగా గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీలో కొన్ని నెలల క్రితమే విలీనమయ్యారు. అయినా తమ గ్రామాల పేర్లనే ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ వస్తున్నారు. ఈ రకంగా కాలనీలో గ్రామాల బోర్డులను ఏర్పాటుచేసుకున్నారు. వీరి ఆధార్‌ కార్డులు, ఓటరు కార్డులు సైతం వారి సొంత గ్రామాల పేరిటే ఉన్నాయి. కానీ తాజాగా స్మార్ట్‌ రేషన్‌ కార్డులను అధికారులు మున్సిపాలిటీలోని భౌగోళిక లొకేషన్‌ పేరిట ముట్రాజ్‌పల్లి, సంగాపూర్‌ గ్రామాల పేరిట అందజేస్తున్నారు. ఆయా గ్రామాల్లో కార్డుల పంపిణీ కూడా ప్రారంభమైంది.

సమస్యల పరిష్కారానికి అవరోధమా?

ముంపు బాధితుల సమస్యలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ప్యాకేజీలు, పరిహారాలే కాకుండా ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీకి గుడి, బడి, అంగన్‌వాడీ కేంద్రాలు అవసరమైన స్థాయిలో లేకపోవడం, శ్మశాన వాటికలు లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. ఈ పెండింగ్‌ సమస్యల పరిష్కారానికి గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి రూ.100కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. కానీ ఒక్క రూపాయి కూడా విదిల్చలేదు. ప్రస్తుతం కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక కూడా వీరి సమస్యల పరిష్కారానికి ఒక్క పైసా విడుదల కాలేదు. ఇలాంటి తరుణంలో తాజాగా స్మార్ట్‌ రేషన్‌ కార్డుల్లో వారి సొంత గ్రామాల పేర్లు మాయమైపోవడం.. ఈ పరిణామం ఇదేవిధంగా కొనసాగితే చిరునామాలు మారిపోయి పెండింగ్‌ సమస్యల పరిష్కారానికి సాంకేతికంగా అవరోధం కలగనున్నదని నిర్వాసిత కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గుర్తింపు లేకుండా చేస్తారా?

నిర్వాసిత కాలనీవాసులకు మా సొంత గ్రామాలు కాకుండా ముట్రాజ్‌పల్లి, సంగాపూర్‌ గ్రామాల పేరిట స్మార్ట్‌ రేషన్‌ కార్డులను అందజేసి మాకు గుర్తింపు లేకుండా చేస్తారా? ఇది సహించేది లేదు. వెంటనే మా గ్రామాల పేర్లను పునరుద్ధరించాలి.

– దామరంచ ప్రతాప్‌రెడ్డి, ఏటిగడ్డకిష్టాపూర్‌, మాజీ సర్పంచ్‌, ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ

ఆందోళనకు సిద్ధం

నిర్వాసిత కాలనీ ప్రజల హక్కులను కాలరాసేలా చేశారు. అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం. ప్రతి అంశంలోనూ ఏదోరకంగా మమ్మల్ని ఇబ్బందిపెడుతున్నారు. ఈ తప్పును సరిచేయకపోతే గజ్వేల్‌ ఆర్‌డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేస్తాం.

– కొలిచెలిమె స్వామి, మాజీ సర్పంచ్‌, లక్ష్మాపూర్‌, ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement