వానమ్మా..
కార్తెలు కరుగుతున్నా.. జాడలేని వరుణుడు
● జిల్లాలో 40 శాతం లోటు వర్షపాతం
● వానాకాలం సాగుపై రైతన్న అయోమయం
● ఇప్పటి వరకు కేవలం 11 వేల ఎకరాల్లోనే సాగు
● జిల్లాలో 5.41 లక్షల ఎకరాల సాగు అంచనా
ఈ ఫొటోలో కనిపిస్తున్నది దుబ్బాకకు చెందిన రైతు ఎంకమ్మగారి నారాయణరెడ్డి. వానలు లేకపోవడంతో ఇప్పటి వరకు వరినారు పోయలేదు. బోరు బావి పెట్టి నారు పోద్దామన్నా.. వానలు కురవకపోతే కష్టమేనన్న పరేషాన్‌లో ఉండు. ఎప్పడు వర్షాలు కురుస్తాయో.. ఏమో.. ఏం చేయోలో తోచడంలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఒక్క రైతే కాదు.. జిల్లాలో అందరి రైతుల పరిస్థితి ఇలాగే ఉంది.
దుబ్బాక/మర్కూక్(గజ్వేల్): రోహిణి, మృగశిర కార్తెలు పోయి ఆరుద్ర కార్తె ప్రారంభమైంది. ఇప్పటికే వానాకాలం ప్రారంభమై నెలరోజులు గడుస్తున్నా పెద్ద వర్షాలు కురవలేదు. దీంతో పంటల సాగుపై రైతుల్లో అయోమయం నెలకొంది. పంటలు వేద్దామంటే వానలు లేవాయో.. ఏంచేయాలో దిక్కుతోచని స్థితిలో జిల్లాలోని రైతాంగం కలవరపడుతోంది.
ఇప్పటి వరకు 11 వేల ఎకరాల్లోనే సాగు..
ఈ వానాకాలంలో జిల్లాలో 5.41 లక్షల ఎకరాల్లో పంటలు సాగు అవుతాయని వ్యవసాయ అధికారుల అంచనా. 3.85 లక్షల ఎకరాల్లో వరి, 1.19 లక్షల ఎకరాల్లో పత్తి, 28 వేల ఎకరాల్లో మొక్కజొన్న, మిగతావి పెసర్లు, కందులు సాగులోకి వస్తాయని భావిస్తున్నారు. వానాకాలం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు కేవలం 11 వేల లోపు ఎకరాల్లోనే పంటలు వేసినట్లు తెలుస్తోంది. 9,970 ఎకరాల్లో పత్తి,760 ఎకరాల్లో మొక్కజొన్న,320 ఎకారల్లో వరి పంటలు సాగు చేశారు. ముందుగా దుక్కులు సిద్ధం చేసుకున్న రైతులు పత్తి, మొక్కజొన్న విత్తనాలు వేసుకోగా అవి కూడా సరిగ్గా మొలకెత్తక పోవడంతో రైతులు పరేషాన్ అవుతున్నారు. అంతంత మాత్రమే మొలకలు వచ్చిన పత్తి పంట వర్షాలు లేక వాడిపోతుండడంతో అప్పులు తెచ్చి పుట్టెడు పెట్టుబడులు పెట్టిన రైతులు ఏం చేయాలో తోచక కన్నీరు పెడుతున్నారు.
వరినార్లు పోసేందుకు వెనుకంజ
వానలు లేక రైతులు వరినార్లు పోసుకునేందుకు వెనుకంజవేస్తున్నారు. వరినార్లు పోస్తే దుక్కులకు నీళ్లు ఎట్లా? అని రైతులు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో అత్యధికంగా ఈ వానాకాలంలో 3.85లక్షల ఎకరాల్లో వరిపంట వేస్తారని అంచనా ఉండగా.. ఇప్పటి వరకు 10 శాతంలోపే వరినార్లు పోసుకున్నట్లు సమాచారం.
వర్షాలు కురవాలంటూ..
వరణుడు కరుణించాలంటూ గ్రామాల్లో రైతులు, మహిళలు, పిల్లలు కప్పతల్లి, బతుకమ్మ ఆటలు, ఆలయాల్లో అభిషేకాలు చేస్తూ పూజలు చేస్తున్నారు. జిల్లాలో జూన్‌లో 61.9మి.మీ. వర్షపాతం కురవాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 22.6 మాత్రమే నమోదు అయింది. అంటే 40 శాతం మేర లోటు వర్ష పాతం నెలకొంది. దీంతో పంటల సాగుపై నీలినీడలు అలుముకున్నాయి.


