రేపటి నుంచి అమలు
వర్గల్(గజ్వేల్): విశేషమైన భక్తజనాదరణ కలిగిన నాచగిరి లక్ష్మీనృసింహక్షేత్రంలో ఆలయ వేళలు మారుతున్నాయి. భక్తులకు నిరీక్షణ లేకుండా ఇక రోజంతా శ్రీవారి దర్శనభాగ్యం లభించనుంది. అదేవిధంగా పూజాకార్యక్రమ వేళలోనూ మార్పులు చేశారు. భక్తుల దర్శనం కోసం ఆలయం ప్రతిరోజు ఉదయం 5.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8.30వరకు తెరిచిఉంటుంది. శని, ఆదివారాల్లో ఎలాంటి విరామం లేకుండా ఉదయం 5.30 నుంచి రాత్రి 8.30 వరకు తెరిచి ఉంటుంది. పూజా కార్యక్రమాల్లోనూ మార్పు చేశారు. స్వామివారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం గురువారం నుంచి నూతన వేళలు అమలులోకి వస్తాయని ఆలయ ఈఓ రంగాచారి తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
సిద్దిపేటజోన్: సిద్దిపేట పట్టణానికి చెందిన ప్రముఖ న్యూరో డాక్టర్ నిరోషాకు గోల్డ్ మెడల్, ఎక్సలెన్స్ అవార్డు లభించింది. కర్ణాటక రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నిర్వహించిన పోటీల్లో 4వ ర్యాంక్ సాధించారు. అదేవిధంగా రాజమండ్రి వైదేహి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ నుంచి గోల్డ్ మెడల్, ఎక్సలెన్స్ అవార్డు అందుకున్నారు.
డీఐఈఓ రవీందర్‌రెడ్డి
కొండపాక(గజ్వేల్): ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేలా కృషి చేయాలని జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి(డీఐఈఓ) రవీందర్‌రెడ్డి అన్నారు. కొండపాకలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంగళవారం సందర్శించారు. అధ్యాపకుల సమయ పాలన, విద్యార్థులు హాజరు రిజిస్టర్‌ను పరిశీలించారు. కళాశాలలో అందుతున్న బోధనలు, మధ్యాహ్న భోజనంపై అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ జూనియర్ కళాశాలల్లో మెరుగైన బోధన అందేలా ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేస్తోందన్నారు. అనంతరం బోధన విషయంలో అధ్యాపకులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి సూచనలు చేశారు.
ఐదేళ్ల లోపు పిల్లలందరికీ
పోలియో చుక్కలు
సిద్ధిపేటకమాన్: జిల్లాలోని ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ ధనరాజ్ సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో పల్స్ పోలియో కార్యక్రమంపై వైద్యాధికారులతో డీఎంహెచ్‌ఓ మంగళవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఈనెల 28న పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నట్లు, పుట్టిన బిడ్డనుంచి ఐదేళ్లలోపు వయస్సు గల పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలన్నారు. పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమానికి ప్రణాళికలు రూపొందించాలని సిబ్బందికి సూచించారు. ఈనెల 28న కేంద్రాల వద్ద 29, 30వ తేదీల్లో సిబ్బంది ఇంటింటికీ తిరిగి పోలియో చుక్కలు వేయాలన్నారు.
ఏబీవీపీ బంద్ విజయవంతం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థపై అవలంబిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఏబీవీపీ ఇచ్చిన పిలుపుతో మంగళవారం జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలు మూసివేసి బంద్ పాటించాయి. జిల్లాలోని ప్రైవేట్ విద్యా సంస్థలు తమ విద్యార్థులకు ముందుగానే సమాచారం అందించి, మంగళవారం పాఠశాలలను మూసివేశాయి. ఈ సందర్భంగా ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ మెంబర్ సావుల ఆదిత్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో కనీస మౌలిక సౌకర్యాలు లేకపోవడం విచారకరమన్నారు. స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల తీవ్ర జాప్యంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.


