‘అంగన్‌వాడీ’లో నియామక ప్రక్రియ
అంగన్‌వాడీ కేంద్రం
సిద్దిపేటజోన్: జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్లు, ఆయాల భర్తీకి జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. నియామకాల ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో మహిళా సంక్షేమశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాలో సుమారు 404 పోస్టులను భర్తీ చేయనున్నట్టు సమాచారం. వాటిలో 93 అంగన్‌వాడీ టీచర్లు, 311 ఆయాలు పోస్టులు ఉన్నట్లు తెలుస్తోంది. నేడో, రేపో అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేయడానికి జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఐతే ప్రభుత్వం ఈసారి ఇంటర్వ్యూ ప్రక్రియ ద్వారా భర్తీ చేయడానికి అడుగులు వేస్తోంది. కలెక్టర్ ఆధ్వర్యంలో సెలక్షన్ కమిటీ ద్వారా పారదర్శకంగా నియమాకాలు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రస్తుతం దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, చేర్యాల ప్రాజెక్టుల పరిధిలో 1,150 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వాటి ద్వారా 65,085 మంది పిల్లలు, 10,355 మంది గర్భిణులు, బాలింతలకు సేవలు అందుతున్నాయి.
నియామకాలపై తర్జనభర్జన
అంగన్‌వాడీలో నియామకాల ప్రక్రియపై ప్రభుత్వం నుంచి జిల్లా యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు రావడంతో ఆయా ప్రాజెక్టుల వారీగా ఖాళీల అంశంపై శిశుసంక్షేమశాఖ దృష్టి సారించింది. ఎట్టకేలకు ప్రాథమిక సమాచారం ప్రకారం 404 పోస్టుల భర్తీకి జిల్లా యంత్రాంగం మొగ్గు చూపుతోంది.
జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా..
ఆయా అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి కలెక్టర్ ఆధ్వర్యంలో సెలక్షన్ కమిటీ కీలకపాత్ర పోషించనుంది. ఈసారి ఇంటర్ ప్రామాణికంగా నియామకం జరగనుంది. ఆయాలకు మాత్రం అత్యవసర పరిస్థితుల్లో సడలింపు ఇచ్చేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. మరోవైపు జిల్లా సెలెక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియలో ఇంటర్వ్యూ పద్ధతి, ఇంటర్ మార్కులు, రిజర్వేషన్ అంశాల్లో వెయిటేజీ మార్కుల ఆధారంగా ఉద్యోగ భర్తీ చేయనున్నారు.
మొత్తంగా 404 పోస్టుల భర్తీకి సన్నాహాలు?
ఖాళీగా 93 టీచర్లు, 311 ఆయాల పోస్టులు
నేడో.. రేపో.. నోటిఫికేషన్ విడుదల
కలెక్టర్ ఆధ్వర్యంలో సెలక్షన్ కమిటీ


