పల్లె ప్రాంత విద్యార్థులపై ఆర్టీసీ కరుణచూపింది. వర్గల్, ములుగు మండలాల పరిధిలోని పలు గ్రామాల విద్యార్థులకు సౌకర్యవంతంగా గజ్వేల్– ప్రజ్ఞాపూర్ డీపో అధికారులు మంగళవారం బస్సు సర్వీస్ ప్రారంభించారు. బస్సు వర్గల్ మండలం శేరిపల్లికి చేరుకోగా అక్కడి సర్పంచ్, పాలకవర్గం, గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. హర్షం వ్యక్తం చేశారు. రోజు ఉదయం 6 గంటలకు గజ్వేల్ స్టేజీ నుంచి బస్సు ప్రారంభమై ప్రజ్ఞాపూర్, గౌరారం, ములుగు, అలీనగర్, కొట్యాల, అడవిమజీద్, లక్ష్మక్కపల్లి, నాగిరెడ్డిపల్లి, వర్గల్, శేరిపల్లి, మైలారం, చౌదరిపల్లి, సంగాపూర్ మీదుగా 9 గంటల వరకు తిరిగి గజ్వేల్ చేరుకుంటుందని అసిస్టెంట్ డిపోమేనేజర్ బాబునాయక్ తెలిపారు. తిరిగి సాయంత్రం 4.15 గంటలకు గజ్వేల్ నుంచి బయలుదేరి అదేరూట్‌లో విద్యార్థులను దింపుతూ రాత్రి 7.30కు గజ్వేల్ చేరుకుంటుందని వివరించారు. గ్రామస్తుల వినతి, విద్యార్థుల ఇబ్బందులు తొలగించేందుకు ఈ సర్వీస్ నడుపుతున్నట్లు తెలపారు.
–వర్గల్(గజ్వేల్)


