జిల్లాలోని మున్సిపాలిటీల్లో డబుల్‌బెడ్రూమ్ ఇళ్లు పొందిన లబ్ధిదారులకు ఇక చట్టపరమైన హక్కులు దక్కబోతున్నాయి. గతంలో ఇళ్ల పంపిణీ ఆదరాబాదరాగా సాగటంతో కొందరికీ మాత్రమే పత్రాలు అందజేసి, చాలా మందికి పెండింగ్‌లో పెట్టారు. తాజాగా వారందరి వివరాలను సేకరిస్తున్నారు. త్వరలోనే పట్టా సర్టిఫికెట్లు అందజేయనున్నారు. – గజ్వేల్
గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో మాజీ సీఎం కేసీఆర్ చొరవ ఫలితంగా డబుల్‌బెడ్రూమ్ మోడల్ కాలనీ మంజూరైంది. 2015 మే 9న మున్సిపాలిటీ పరిధిలోని పాలిటెక్నిక్ వెనుకభాగంలో ఈ పనులను ప్రారంభించి.. కొంత కాలానికి పూర్తి చేశారు. ఇక్కడ ఒక్కో ఇల్లు 570చదరపు గజాల విస్తీర్ణంలో 156 బ్లాకులుగా నిర్మించారు. ఒక్కో బ్లాకులో రెండు ఫ్లోర్లలో కింద నాలుగు, పైన నాలుగు చొప్పున 8 ఇళ్లను నిర్మించారు. కానీ ఇళ్ల పంపిణీ వ్యవహారం ఏళ్ల తరబడి నానుతూ వచ్చింది. వివిధ రకాల ఆందోళనల తర్వాత 2023 మార్చి 21న అధికారులు లక్కీ డ్రా నిర్వహించి 1100మందిని ఎంపిక చేశారు. కానీ ఆ కాలనీలో తాత్కాలికంగా నివాసముంటున్న మల్లన్నసాగర్ నిర్వాసితులను ఖాళీ చేయించి, 1100మందికి గృహ ప్రవేశాలు చేయించడం అధికారులకు సవాలుగా మాంది. కొంత కాలంగా చాలామంది నిర్వాసితులు ఖాళీ చేసి వెళ్లిపోగా.. లక్కీ డ్రా ద్వారా ఎంపికై న లబ్ధిదారులు నేరుగా తమకు కేటాయించిన నెంబర్లలో సుమారు 800మందివరకు ఇళ్లను స్వాధీనం చేసుకొని ప్రస్తుతం నివాసముంటున్నారు.
వివరాల సేకరణ
డబుల్ ఇళ్లలో నివాసముంటూ ఇంకా చట్టపరమైన హక్కులను పొందని లబ్ధిదారుల వివరాలను కొన్ని రోజులుగా గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ అధికారులు సేకరిస్తున్నారు. ఇటీవల కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఈ ఆదేశాలు అందగా, లబ్ధిదారులకు సంబంధించిన ఆధార్ కార్డులు, రేషన్ కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణతోపాటు ఇతర పత్రాలను సేకరించే పనిలో నిమగ్నమై ఉన్నారు. గజ్వేల్‌లో ఇప్పటివరకు 750మందికిపై డాటా సేకరించినట్లు సమాచారం. త్వరలోనే ఈ డాటాను కలెక్టర్‌కు అందజేసి.. సర్టిఫికెట్లు అందజేయడానికి చర్యలు చేపట్టబోతున్నారు.
దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాలలోనూ...
జిల్లాలోని దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల మున్సిపాలిటీల్లోనూ డబుల్ ఇళ్ల లబ్ధిదారుల వివరాల సేకరణ జోరుగా సాగుతోంది. సిద్దిపేట మున్సిపాలిటీలో గతంలోనే పట్టా సర్టిఫికెట్ల పంపిణీ పూర్తయ్యింది. కానీ వివిధ కారణాలతో గజ్వేల్–ప్రజ్ఞాపూర్, దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల మున్సిపాలిటీల్లో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం దానిని పూర్తి చేయడానికి అధికారులు వేగంగా ముందుకుసాగుతున్నారు. చాలా గ్రామాల్లోనూ ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సైతం ఆదేశాలు వచ్చినట్లు చెబుతున్నారు. కాగా గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో జరుగుతున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వివరాల సేకరణ ప్రక్రియను స్థానిక మున్సిపల్ కమిషనర్ గణేష్‌రెడ్డి ధ్రువీకరించారు.


