ప్రగతి ప్రణాళిక
సిద్దిపేటరూరల్: ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాలను ప్రజల భాగస్వామ్యంతో విజయవంతంగా నిర్వహించినందుకు జిల్లా అధికార యంత్రంగాన్ని ప్రగతి ప్రణాళిక జిల్లా ప్రత్యేక అధికారి అహ్మద్ నదీమ్ (ఐఏఎస్) అభినందించారు. సోమవారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్ లో కలెక్టర్ హైమావతి, సీపీ రష్మీ పెరుమాళ్ తో కలిసి ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికపై సమీక్ష నిర్వహించారు. మొదటగా ఆయన జిల్లాలో వివిధ శాఖలు అమలు చేసిన కార్యక్రమాలకు సంబంధించిన ఫొటో ప్రదర్శనను, శాఖల నివేదికలను పరిశీలించారు. కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్న కలెక్టర్ హైమావతిని ప్రత్యేకంగా అభినందించారు. సమీక్షా సమావేశంలో వైద్య, వ్యవసాయ, విద్య, గ్రామీణ అభివృద్ధి పోలీస్, ఐసీడీఎస్, ఫుడ్ సేఫ్టీ, సంక్షేమ శాఖలు, పంచాయతీ, మున్సిపల్ అధికారులు తమ శాఖల ద్వారా చేపట్టిన కార్యక్రమాల ప్రగతిపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చారు. అనంతరం ప్రత్యేక అధికారి మాట్లాడుతూ ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లాలో వార్డు, గ్రామ, మండల సభల ద్వారా దాదాపు 19 వేల ఫిర్యాదులను వచ్చాయన్నారు. వాటిని ప్రణాళిక బద్ధంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా వ్యవహరించడం ద్వారా ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరుగుతుందని అన్నారు. అలాగే వానాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ, వార్డు సభలలో స్వీకరించిన దరఖాస్తుల స్క్రూటినీ, కంప్యూటరీకరణ దాదాపు 50 శాతం పూర్తయినందున మిగతా పని త్వరగా పూర్తి చేయాలన్నారు. జిల్లాలో వివిధ శాఖలు సాధించిన పురోగతి, పెండింగ్ సమస్యలపై శాఖల వారీగా సమగ్ర సమాచారంతో కూడిన బుక్‌లెట్‌ను సిద్ధం చేయాలన్నారు. అంతకుముందు కలెక్టర్ హైమావతి మాట్లాడుతూ అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయడం వల్ల ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామన్నారు. ప్రత్యేక అధికారి సూచనల మేరకు నిర్ణీత సమయంలో సమస్యల పరిష్కారానికి ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తామన్నారు. కార్యక్రమం ముగింపులో ప్రత్యేక అధికారి ‘నషా ముక్త్ భారత్’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అంతకుముందు కలెక్టరేట్‌కు చేరుకున్న ప్రత్యేక అధికారి అహ్మద్ నదీమ్ ను కలెక్టర్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతించారు. సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి, సీపీఓ, అదనపు డీసీపీ, ఆర్డీవోలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.
అధికారుల చొరవ అభినందనీయం
ప్రత్యేకాధికారి అహ్మద్ నదీమ్
కలెక్టర్‌తో కలిసి 99 రోజుల కార్యక్రమాలపై సమీక్ష


