● భోజనం బాగుందా.. బడికి వెళ్తున్నారా?
● బాలసదనం చిన్నారులతో కలెక్టర్ హైమావతి
సిద్దిపేటజోన్: పిల్లలూ బాగున్నారా.. భోజనం బాగుందా?.. రోజూ పాఠశాలకు వెళ్తున్నారా.. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా?అంటూ కలెక్టర్ హైమావతి ఆప్యాయంగా పిల్లలతో ముచ్చటించారు. సోమవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని బాల సదనాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాసేపు పిల్లలతో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలోని మామిడి చెట్లకు కాసిన పండ్లను పిల్లలకు పంపిణీ చేశారు. వానాకాలం మొదలైందని కాచిన నీటిని చల్లార్చిన తర్వాతే తాగాలని, అదేవిధంగా వేడివేడి ఆహారాన్ని తీసుకోవాలని పిల్లలకు జాగ్రత్తలు సూచించారు. మంచి అలవాట్లను అలవర్చుకోవాలని, ఎల్లప్పుడూ క్రమశిక్షణతో, ధైర్యంగా ఉండాలని, రోజూ యోగా, ధ్యానం లాంటివి తప్పనిసరి అలవాటు చేసుకోవాలని సూచించారు. అమ్మ తరహాలో కలెక్టర్ యోగక్షేమాలపై ఆరా తీయడంతో పిల్లలు సంతోషం వ్యక్తం చేశారు. భోజనం బాగానే ఉందని, స్కూల్‌కు వెళ్తున్నా మని వారు బదులిచ్చారు. మెనూ ప్రకారం భోజనం రుచికరంగా పెట్టాలని, వానాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మహిళ శిశు సంక్షేమ శాఖ అధికారి శారదను కలెక్టర్ ఆదేశించారు.


