చిన్నకోడూరు(సిద్దిపేట): వర్షాకాలం ప్రవేశించి ఇరవై రోజులు గడుస్తున్నా వర్షాల జాడలేదు. ఈ వేసవి కాలంలో ఎండల తీవ్రత అధికంగా ఉంది. నేటికీ ఎండ తీవ్రత తగ్గడం లేదు. అసలు ఇది వానాకాలమా? ఎండాకాలమా? అన్నట్లు వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. వానాకాలం ప్రారంభానికి ముందే రైతులు విత్తనాలు కొనుగోలు చేసి, దుక్కులు దున్ని విత్తడానికి సిద్ధమయ్యారు. ఎండల తీవ్రత వల్ల రైతులు పొలం పనులకు వెళ్లలేకపోతున్నామని వాపోతున్నారు. భారీ వర్షాల జాడలేక వ్యవసాయ పనులు ముందుకు సాగడం లేదని రైతులు పేర్కొంటున్నారు. మబ్బులు వస్తున్నా చినుకు మాత్రం కురవడం లేదు. భారీ వర్షాలు కురిస్తేగాని వాతావరణం చల్లబడే లేదని పలువురు పేర్కొంటున్నారు.


