బొర్రగూడెంలో 2కే వాకథాన్‌ | - | Sakshi
Sakshi News home page

బొర్రగూడెంలో 2కే వాకథాన్‌

Jun 22 2026 7:03 AM | Updated on Jun 22 2026 7:03 AM

వర్గల్‌(గజ్వేల్‌): అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆదివారం వర్గల్‌ మండలం బొర్రగూడెంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు 2కే వాకథాన్‌ నిర్వహించారు. రెండు కిలోమీటర్ల నడక అనంతరం పాఠశాల విద్యార్థులతో కలిసి సూర్యనమస్కారం, యోగాసనాలు వేశారు. మానసిక, శారీరక ఆరోగ్యానికి యోగాఎంతగానో దోహదపడుతుందని, ప్రజలు తమ మొబైల్‌ నుంచి 1800–315–7008 నంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇచ్చి, ఉచిత యోగా పాఠాలను వాట్సాప్‌లో పొందవచ్చని హెచ్‌ఎం రాజనరేందర్‌రెడ్డి తెలిపారు.

అధిక వసూళ్లను అరికట్టండి

హుస్నాబాద్‌: పట్టణంలో ప్రతి శుక్రవారం నిర్వహించే అంగడిలో అధిక వసూళ్లకు పాల్పడుతున్నారని సీపీఎం నియోజకవర్గ నాయకుడు శివరాజ్‌ తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మున్సిపల్‌ నిర్ణయించిన ధరల కంటే సదరు కాంట్రాక్టర్‌ అధికంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అంగడి వేలం పాటను అధికంగా పాడి రైతులను దోచుకుంటున్నారన్నారు. వసూళ్లకు సంబంధించి రశీదు ఇవ్వకుండా రైతులు, వ్యాపారులను మోసం చేస్తున్నారని తెలిపారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే కాంట్రాక్టర్‌ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. అధికారులు స్పందించి అధిక వసూళ్ల దోపిడీని అరికట్టాలని డిమాండ్‌ చేశారు.

హాస్టల్‌ భవన నిర్మాణానికి అనుమతి

హుస్నాబాద్‌: ఇంజనీరింగ్‌ కళాశాల హాస్టల్‌ భవన నిర్మాణ పనులు ప్రారంభించాలని శాతవాహన యూనివర్సిటీ వైస్‌ చాన్సులర్‌ ఉమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. మండలంలోని ఉమ్మాపూర్‌లో కళాశాలకు సంబంధించిన బాలుర హాస్టల్‌ నిర్మాణానికి రూ.7.28 కోట్లు, బాలికల హాస్టల్‌ నిర్మాణానికి రూ.7.28 కోట్లు మంజూరయ్యాయి. అలాగే టెండర్లు కూడా పూర్తిచేశారు. వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాలని సంబంధిత ఈఈని ఆదేశించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement