హామీల అమలులో కాంగ్రెస్‌ విఫలం | - | Sakshi
Sakshi News home page

హామీల అమలులో కాంగ్రెస్‌ విఫలం

Jun 21 2026 8:10 AM | Updated on Jun 21 2026 8:10 AM

కొమురవెల్లి(సిద్దిపేట): ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌ విమర్శించారు. శనివారం బీజేపీ నాయకులతో కలిసి ప్రారంభానికి సిద్ధంగా ఉన్న కొమురవెల్లి రైల్వేస్టేషన్‌ను ఆయన పరిశీలించి మాట్లాడారు. రాష్ట్రంలో రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన పన్నెండేళ్ల పాలనలో దేశంలో సమగ్ర అభివృద్ధి సాధించాడని తెలిపారు. రాష్ట్రంలో రైల్వే లైన్ల అభివృద్ధికి రూ.5500 కోట్లు ఇచ్చిన ఘనత మోదీకే దక్కిందన్నారు. త్వరలోనే రైల్వే స్టేషన్‌ను ప్రారంభిస్తామన్నారు. అనంతరం కొమురవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకొని పూజలు చేశారు. కాగా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని సర్పంచ్‌ పద్మ, ఆలయ అధికారులు, కాంగ్రెస్‌ నాయకులు వేర్వేరుగా వినతి పత్రాలు అందించారు. ఆయన వెంట జనగామ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

అవినీతి రహిత పాలన బీజేపీకే సాధ్యం

గజ్వేల్‌: అవినీతి రహిత పాలన బీజేపీకే సాధ్యమని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ అన్నారు. శనివారం గజ్వేల్‌లో కురుమ రిజర్వేషన్‌ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బింగి స్వామి నివాసంలో ఏర్పాటు చేసిన సహపంక్తి భోజన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. ఆయన నాయకత్వమే దేశానికి శ్రీరామరక్ష అని చెప్పారు. 2029లో తెలంగాణతో పాటు దేశంలో అన్ని రాష్ట్రాల్లో జమిలి ఎన్నికలు వస్తాయని చెప్పారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కప్పర ప్రసాదరావు, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ గాడిపల్లి భాస్కర్‌, నాయకులు ఎల్లు రాంరెడ్డి, మనోహర్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement