ప్రజలను ఇబ్బంది పెడితే సహించం | - | Sakshi
Sakshi News home page

ప్రజలను ఇబ్బంది పెడితే సహించం

Jun 21 2026 8:10 AM | Updated on Jun 21 2026 8:10 AM

గజ్వేల్‌: కాంగ్రెస్‌ తమకు మిత్రపక్షమైనా, ప్రజలకు ఇబ్బంది కలిగించే చర్యలకు పాల్పడితే ఊరుకునేది లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం గజ్వేల్‌లో ఉమ్మడి మెదక్‌ జిల్లా కౌన్సిల్‌ సభ్యులకు నిర్వహిస్తున్న రాజకీయ శిక్షణా శిబిరానికి హాజరై మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చుకోవాలని డిమాండ్‌ చేశారు. విలీన ప్రక్రియను పూర్తిచేసి, కార్మిక సంఘాల ఎన్నికల నిర్వహణకు సహకరించాలన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో కొన్ని మాత్రమే కాంగ్రెస్‌ నెరవేర్చగలిగిందన్నారు. రైతులకిచ్చిన మాటలను సైతం నిలుపుకోవాలన్నారు. రాష్ట్రంలోని చాలా చోట్ల బడాబాబుల ప్రయోజనాల కోసం పేదల గుడిసెలను కూల్చేస్తున్నారని మండిపడ్డారు. ఈ అంశంపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేదిశగా లెఫ్ట్‌ పార్టీలతో కలిసి త్వరలోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ‘సర్‌’ పేరుతో తెలంగాణలోని 84 లక్షల ఓట్లను తొలగించడానికి కుట్ర జరుగుతున్నదని ఆరోపించారు. సమావేశంలో సీపీఐ సీనియర్‌ నాయకులు వీర్ల ప్రకాశ్‌రావు, భట్టు దయానందరెడ్డి, సిద్దిపేట, మెదక్‌, సంగారెడ్డి జిల్లాల కార్యదర్శులు మంద పవన్‌, ఖాళీక్‌, జలాలుద్ధీన్‌, నాయకులు రాజేశం, శిలింగు కృష్ణ, జనార్దన్‌ తదితరులు పాల్గొన్నారు.

హామీల అమలులో

కాంగ్రెస్‌ నిర్లక్ష్యం వీడాలి

కొత్తగూడెం ఎమ్మెల్యే

కూనంనేని సాంబశిరావు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement