సిద్దిపేటజోన్: ఈనెల 21న సిద్దిపేటలోని స్టేడియంలో జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల ఏర్పాట్లను శుక్రవారం కలెక్టర్ హైమావతి పరిశీలించారు. ఆదివారం ఉదయం 6గంటలకు సుమారు వెయ్యి మందితో యోగాసనాలు నిర్వహిస్తారని, దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. యోగా మ్యాట్స్, తాగునీరు వసతి, వేదిక, మైక్ సౌండ్ తదితర అంశాలపై ఆరా తీశారు. ఆమె వెంట జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్, ఆర్డీఓ సదానందం పాల్గొన్నారు.
కేక్ కట్ చేసిన మంత్రి వివేక్
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను శుక్రవారం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి, రేణుకా ఎల్లమ్మ ఆలయంలో పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ దేశానికి కాబోయే ప్రధాని అన్నారు. కాగా జిల్లా గ్రంథాలయ సంస్థలో సంస్థ చైర్మన్ చంద్రం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, విద్యార్థులకు నోట్‌బుక్స్, ప్యాడ్ పంపిణీ చేశారు. నియోజకవర్గ ఇన్‌చార్జి హరికృష్ణ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబురాలు నిర్వహించారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
సిద్దిపేటకమాన్: సిద్దిపేట మున్సిపాలిటీ పరిధి ఒకటో వార్డు లింగారెడ్డిపల్లిలో శుక్రవారం పలు అభివృద్ధి పనులకు మంత్రి వివేక్ శంకుస్థాపన చేశారు. మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుతో కలిసి మంత్రి బస్తీ దవాఖాన వద్ద బోర్ పనులను ప్రారంభించారు.
కార్పొరేట్ల ప్రయోజనాలకే కొమ్ముకాస్తున్న బీజేపీ: మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి
గజ్వేల్: కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తోందని మాజీ ఎమ్మెల్యే టి.నర్సారెడ్డి విమర్శించారు. శుక్రవారం రాహుల్‌గాంధీ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ అధ్వర్యంలో రక్తదాన శిబిరం, అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో గృహనిర్మాణ సంస్థ మాజీ చైర్మన్ భూంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.


