5.4లక్షల మెట్రిక్‌ టన్నుల కొనుగోళ్లు | - | Sakshi
Sakshi News home page

5.4లక్షల మెట్రిక్‌ టన్నుల కొనుగోళ్లు

Jun 20 2026 11:55 AM | Updated on Jun 20 2026 11:55 AM

అందరి సహకారంతో విజయవంతం

నిర్దేశించిన లక్ష్యాన్ని మించి సేకరణ

97,807 మంది రైతుల నుంచి..

రూ.1,204 కోట్ల విలువైన ధాన్యం

రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధరను అందించడంతోపాటుగా, అందరి అధికారుల సమన్వయం,సహకారంతో విజయవంతంగా కొనుగోలు ప్రక్రియ ముగిసింది. రైతులు, పీఏసీఎస్‌, ఐకేపీ నిర్వాహకులు, రైస్‌మిల్లర్లు, రవాణా కాంట్రాక్టర్లు, రెవెన్యూ, వ్యవసాయ, సహకార, పౌరసరాఫరాల శాఖల అధికారుల చొరవ ఎంతో అభినందనీయం. –కె.హైమావతి, కలెక్టర్‌

సిద్దిపేటరూరల్‌: జిల్లాలో 2025–26 యాసంగి కాలంలో జిల్లా వరి ధాన్యం కొనుగోళ్లలో రికార్డు సృష్టించింది. నిర్దేశించిన లక్ష్యానికి మించి కొనుగోళ్లు చేపట్టారు. ఈ మేరకు జిల్లాకు కేటాయించిన లక్ష్యం 4.50లక్షల మెట్రిక్‌ టన్నుల లక్ష్యాన్ని అధిగమించింది. జిల్లాలో ఏర్పాటు చేసిన 427 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా మొత్తంగా 5.4లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి జిల్లా ఆదర్శంగా నిలిచింది. కేంద్రాల్లో మెరుగైన సౌకర్యాలు, సదుపాయాలు కల్పించడంతో కొనుగోలు ప్రక్రియ విజయవంతంగా ముగిసింది.

ఎన్నడూలేని విధంగా కొనుగోళ్లు

గత 2023–24 యాసంగి వరిధాన్యం కొనుగోళ్లలో జిల్లా 3.40లక్షల మెట్రిక్‌ టన్నుల మేర ధాన్యం కొనుగోలు చేపట్టగా, 2024–25 యాసంగి కొనుగోళ్లలో 3.54లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. 2025–26 యాసంగిలో 97,807 రైతుల నుంచి ఏకంగా 5,04,161 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించింది.

రూ.1,204 కోట్ల ధాన్యం సేకరణ

జిల్లాలోని అన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా మొత్తంగా 97,807 మంది రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించారు. రూ.1,204 కోట్ల విలువైన ధాన్యం సేకరించడంతో పాటుగా ఇప్పటివరకు రూ.1,036 కోట్ల డబ్బులను రైతుల ఖాతాల్లో జమచేశారు. మిగిలిన రైతులకు త్వరలో పూర్తి స్థాయిలో చెల్లింపులు చేయనున్నారు.

మార్గదర్శకాల మేరకు కొనుగోళ్లు

జిల్లాలో చేపట్టిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రక్రియ కలెక్టర్‌ ఆదేశాల మేరకు రెవెన్యూ, మార్కెటింగ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల ప్రత్యేక పర్యవేక్షణతో సజావుగా సాగింది. వర్షాకాలం సమీపించకముందే వేగంగా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేశారు. అదనపు హమాలీలు, రవాణా వాహనాల ఏర్పాటు, మిల్లర్లతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ, క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటిస్తూ అధికార యంత్రాంగం పటిష్టంగా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేసింది.

ధాన్యం కోసం అద్దె గోదాముల సేకరణ

నిర్దేశించుకున్న లక్ష్యానికి మించి ధాన్యం దిగుబడి రావడంతో రైతుల నుంచి ప్రతీ గింజను కొనుగోలు చేసినట్లైంది. ధాన్యం నిల్వకోసం జిల్లాలో ఉన్న గోదాములు సరిపోక పలు గోదాములను అద్దెకు తీసుకుని సైతం ధాన్యం నిల్వ ఉంచేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టి పూర్తిస్థాయిలో 5.4లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని నిల్వ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement