హుస్నాబాద్: వడగండ్ల వాన రైతులను అతలాకుతలం చేసింది. చేతికందిన పంట వర్షం పాలు కావడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. హుస్నాబాద్ పట్టణంలో ఆదివారం కొద్ది సేపు కురిసిన రాళ్ల వర్షంతో అన్నదాతల ఆశలు ఆవిరయ్యాయి. వ్యవసాయ మార్కెట్ యార్డులో ఽరైతులు ఆరబెట్టిన ధాన్యం కళ్లెదుటే వర్షానికి కొట్టుకుపోవడంతో రైతులు దిగాలు చెందారు. మార్కెట్ యార్డులో గ్యాప్ లేకుండా ధాన్యం రాశులు నిండిపోయాయి. మండుతున్న ఎండలకు ధాన్యం మ్యాచర్ వచ్చినా నాలుగు రోజుల నుంచి ధాన్యం కొనుగోళ్లు చేయలేదని రైతులు వాపోయారు. వర్షానికి ధాన్యమంతా తడిసిపోయింది. వారం రోజుల నుంచి గన్నీ బ్యాగులు ఇవ్వాలని కోరినా, ఆన్‌లైన్‌లో నమోదు చేసిన తర్వాతే ఇస్తామని ఇబ్బందులు పెడుతున్నారని అన్నదాతలు ఆవేదన చెందారు. మరికొంత మందికి గన్నీ బ్యాగులు ఇచ్చినా కాంటాలు పెట్టకుండా వదిలేశారని తెలిపారు. టార్పాలిన్లు ఇవ్వాలని కోరినా ఎండలే ఉన్నాయని ఇప్పుడెందుకు అంటూ నిరాకరించారని చెప్పారు. రోజుల తరబడి మార్కెట్‌లోనే ధాన్యం కుప్పలకు కాపలా కాస్తున్నా... చెడగొట్టు వానతో నిండా ముంచిందని వాపోయారు. రవాణా సౌకర్యం లేకపోవడం, ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కాంటా పెట్టి మిల్లులకు తరలించకపోవడంతో అకాల వర్షానికి ధాన్యమంతా నీళ్ల పాలైంది. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. తడిసిన ధాన్యాన్ని మున్సిపల్ చైర్‌పర్సన్ లక్ష్మి, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ చందు, కౌన్సిలర్ రవీందర్ పరిశీలించారు.
తడిసిన ధాన్యాన్ని ఎత్తిపోస్తున్న రైతులు
వడగండ్లతో రైతులకు కడగండ్లు
అకాల వర్షంతో
ఆవిరైన అన్నదాతల ఆశలు
మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యం


