గజ్వేల్: వడ్ల కొనుగోళ్లకు మరో కష్టం వచ్చిపడింది. పొద్దుతిరుగుడు ధాన్యంతో మార్కెట్ యార్డు లు నిండిపోయాయి. దీంతో వడ్లకు చోటు లేకుండా పోయింది. జిల్లాలో వడ్ల కొనుగోళ్లకు ఎన్నో రకాల ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. వరిధాన్యం ఉత్పత్తులు పోటెత్తుతుండగా, అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు లేకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. యాసంగికి సంబంధించి జిల్లాలో 3.7లక్షల ఎకరాల్లో వరి సాగులోకి వచ్చింది. అధికారుల అంచనా ప్రకారం 5లక్షల మెట్రిక్ టన్నులకుపైగా ఉత్పత్తులు కొనుగోళ్లకు రానున్నాయి. 422 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఐకేపీ అధ్వర్యంలో 214, సహకార సంఘాల ఆధ్వర్యంలో 202, మెప్మా ఆధ్వర్యంలో మరో 6 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.
మార్కెట్ యార్డుల ఫుల్
జిల్లాలోని గజ్వేల్, సిద్దిపేట, తొగుట, బెజ్జంకి, హుస్నాబాద్, మిర్‌దొడ్డి, చిన్నకోడూరు మార్కెట్ యార్డులు పొద్దుతిరుగుడు రాశులతో నిండిపోయాయి. ఎన్నో అశలతో పొద్దు తిరుగుడు సాగు చేసిన రైతులు.. తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. ఆయా కేంద్రాల్లో కొద్ది రోజులు మాత్రమే కొనుగోళ్లు సాగాయి. కేంద్ర ప్రభుత్వం టార్గెట్ ముగిసిందనే పేరుతో జిల్లావ్యాప్తంగా కేవలం 1,800 టన్నులు మాత్రమే కొనుగోలు చేసి గత నెల 18వ తేదీ నుంచే కేంద్రాలను మూసేశారు. ఫలితంగా ఆయా యార్డుల్లో ఇంకా 3,500 టన్నులకుపైగా పొద్దుతిరుగుడు నిల్వలు పేరుకుపోయి ఉన్నాయి. ఈ నిల్వల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పొడిగింపు వస్తుందని అధికారులు చెబుతూ వస్తున్నారు. కానీ రోజులు గడుస్తున్నా..ఫలితం లేకుండా పోతుంది. దీంతో రైతులు ఆయా మార్కెట్ యార్డుల్లో నెలకుపైగా నిరీక్షణలో ఉన్నారు. ఇప్పటికై నా వీటి కొనుగోలు జరుగుతుందా...? లేదా అనేది అనుమానంగా ఉన్నది.
పొద్దుతిరుగుడు ఖాళీ అయితేనే..
పొద్దు తిరుగుడు కొనుగోళ్లు జరిగి...అవి ఖాళీ అయితేనే అయా మార్కెట్ యార్డుల్లో వడ్ల కొనుగోళ్లకు అవకాశం కలగనుంది. ఇప్పటికే వరిధాన్యం మార్కెట్ యార్డులకు పోటెత్తుతున్నది. షెడ్లలో ఖాళీ లేక... రైతులు తమ ఉత్పత్తులను యార్డుల్లో ఆరుబయటే పోస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తాజాగా అదివారం హుస్నాబాద్ మార్కెట్ యార్డులో వడగండ్ల వానకు వరి ధాన్యం తడిసి ముద్దయిన ఘటన ఆందోళన కలిగిస్తున్నది.
పొద్దు తిరుగుడు రాశులు
ఖాళీ చేయిస్తాం
పొద్దుతిరుగుడు కొనుగోళ్లకు తేదీని పొడగించే అవకాశమున్నది. రాగానే వారంలో కొనుగోళ్లను పూర్తి చేసి మార్కెట్ యార్డులను ఖాళీ చేయిస్తాం. దీనిద్వారా వడ్ల కొనుగోళ్లకు ఇబ్బందులు రాకుండా చూస్తాం.
– మార్క్‌ఫెడ్ డీఎం సునీత
పొద్దుతిరుగుడు ధాన్యంతో
మార్కెట్ యార్డులు ఫుల్
కొనుగోలు తేదీ
పొడిగింపు రాక ఈ దుస్థితి
అవి ఖాళీ అయితేనే...
వడ్ల కొనుగోళ్లకు అవకాశం
నిరీక్షణలో పొద్దుతిరుగుడు రైతులు


