ఇక వినతులకు సులువే.. | - | Sakshi
Sakshi News home page

ఇక వినతులకు సులువే..

May 4 2026 10:19 AM | Updated on May 4 2026 10:19 AM

సిద్దిపేటజోన్‌: ప్రజావాణిలో సమస్యలపై ఫిర్యాదు ప్రక్రియ ఇక సులభతరంగా మారనుంది. ప్రజలకు మరింత చేరువగా చేసే పనిలో భాగంగా జిల్లాలో ఆర్డీఓ కేంద్రాలుగా ప్రజావాణిలను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు కలెక్టరేట్‌లో మాత్రమే అర్జీలు స్వీకరించేవారు. కొత్త నిబంధనల మేరకు ప్రతి సోమవారం కలెక్టరేట్‌తో పాటు రెవెన్యూ డివిజన్ల వారీగా ఫిర్యాదులు స్వీకరిస్తారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు కలెక్టర్‌ హైమావతి జారీ చేశారు. జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్‌, హుస్నాబాద్‌ రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఐదు మున్సిపాలిటీలు, 26 మండలాల్లో 499 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆయా ప్రాంతానికి చెందిన ప్రజల ఫిర్యాదులు, సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం ప్రజావాణి ఏర్పాటు చేసింది. ప్రతి వారం జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన బాధితులు కలెక్టరేట్‌కు వచ్చి అధికారులకు అర్జీలు సమర్పించేవారు. ఈ లెక్కన 90నుంచి 150వరకు వివిధ అంశాలపై దరఖాస్తులు వచ్చేవి. కలెక్టరేట్‌లో మాత్రమే ఉన్న ప్రజావాణి ప్రక్రియను మరింత విస్తృత పరిచేందుకు ఆర్డీఓ కార్యాలయాల్లో కూడా అమలు చేస్తున్నారు. భూముల సమస్యలు, పింఛన్లు, ఇంటి మంజూరు, ఉద్యోగం తదితర అంశాలపై అర్జీలు అధికంగా వస్తున్నాయి. కొన్ని మండలం, రెవెన్యూ స్థాయిలో ఉండే సమస్యలపై కలెక్టరేట్‌లో ప్రజావాణిలో దరఖాస్తులు అందిస్తున్నారు. ప్రజలకు ఫిర్యాదు ప్రక్రియ సులభంగా మార్చేందుకు జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్‌ కార్యాలయాల్లో ప్రత్యేకంగా ప్రజావాణిని అందుబాటులోకి తెచ్చారు. ప్రతి సోమవారం ఉదయం10గంటల నుంచి ఆయా డివిజన్‌ స్థాయి అధికారులు అందుబాటులో ఉండి ప్రజావాణిలో అర్జీలు స్వీకరించనున్నారు. దీని వల్ల సుదూరంగా ఉండే జిల్లా కేంద్రానికి ప్రజలు అర్జీలు ఇవ్వడానికి వెళ్లే ప్రయాస తగ్గుతుంది. ఎక్కడికక్కడ అర్జీలు అధికారులకు ఇచ్చే వెసులుబాటు కల్గనుంది.

సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్‌

జిల్లాలో ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్‌తో పాటు సిద్దిపేట, గజ్వేల్‌, హుస్నాబాద్‌ రెవెన్యూ డివిజన్లలో ప్రజావాణి కార్యక్రమాలు ఉంటాయని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ హైమావతి సూచించారు. డివిజనల్‌ స్థాయి అధికారులు అందుబాటులో ఉండి అర్జీలు తీసుకుంటారని పేర్కొన్నారు. ఆయా డివిజన్‌ ప్రజలు ఆర్డీఓ ఆఫీస్‌లోని ప్రజావాణిలో దరఖాస్తులు సమర్పించాలన్నారు.

సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయం

మరింత చేరువగా ప్రజావాణి

జిల్లాలో ఆర్డీఓ కేంద్రాలుగా ఏర్పాటు

ఎక్కడికక్కడ దరఖాస్తుల స్వీకరణ

నేటి నుంచి జిల్లాలో అమలు

Advertisement
 
Advertisement
Advertisement